poulomi avante poulomi avante

రెరా కు కావాలి.. రెగ్యుల‌ర్ ఛైర్మ‌న్!

  • నిర్వీర్య‌మ‌వుతున్న తెలంగాణ రెరా అథారిటీ వ్య‌వ‌స్థ‌
  • పెరుగుతున్న యూడీఎస్‌, ప్రీలాంచ్ సేల్స్ స్కామ్
  • ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే రెగ్యుల‌ర్ ఛైర్మ‌న్‌ను నియ‌మించాలి
  • కోరుతున్న కొనుగోలుదారులు
  • అప్పుడే రియ‌ల్ అక్ర‌మాలు త‌గ్గుతాయ్‌

తెలంగాణ రెరా అథారిటీ (RERA Authority Telangana ) ఏర్పాటైన తొలి రోజుల్లో.. రాష్ట్ర ప్రభుత్వం రెరా అథారిటీకి ఛైర్మ‌న్‌గా ఐఏఎస్ అధికారి రాజేశ్వ‌ర్ తివారికి అద‌న‌పు బాధ్య‌త‌ల్ని అప్ప‌గించింది. దీంతో, ఆయ‌న ప్ర‌త్యేక దృష్టి సారించి తెలంగాణ‌లో రెరా అథారిటీని ఏర్పాటు చేయ‌డంలో విజ‌యం సాధించారు. మొద‌ట్లో రెరా అంటే బిల్డ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్లు, రియ‌ల్ట‌ర్లు కొంత జంకేవారు. నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ప్రాజెక్టుల్నిచేయాల‌ని తీర్మానించారు. రెరాను త‌ప్ప‌కుండా మ‌న రాష్ట్రంలో అమ‌లు చేయాల‌ని కోరుకున్నారు. కానీ, రాజేశ్వ‌ర్ తివారి ప‌ద‌వీవిర‌మ‌ణ చేశాక‌.. ప్ర‌భుత్వం ఈ పోస్టును పూర్తిగా మ‌ర్చిపోయింది.

అప్ప‌టివ‌ర‌కూ రెరా అథారిటీ ఛైర్మ‌న్‌గా ఉన్న మ‌రో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ సీఎస్ కావ‌డంతో.. స‌హ‌జంగా ఆయ‌న‌కు ప‌ని ఒత్తిడి ఎక్కువై పోయింది. దీంతో, రెరాపై దృష్టి సారించ లేక‌పోతున్నారు. ఇదే అద‌ను భావించి హైద‌రాబాద్‌లో అధిక శాతం మంది బిల్డ‌ర్లు, రియ‌ల్ట‌ర్లు అక్ర‌మ మార్గాల‌కు తెర లేపారు. యూడీఎస్, ప్రీ లాంచ్‌, సాఫ్ట్ లాంచ్ సేల్స్ అంటూ కొనుగోలుదారుల్ని బుట్ట‌లో వేసుకుంటున్నారు. ఎలాగూ రెరా అథారిటీ నిర్వీర్య‌మైంది కాబ‌ట్టి, వీరి ఆడిందే ఆట పాడిందే పాట‌గా కొన‌సాగుతోంది. గ‌త రెండేళ్ల నుంచి ఈ వ్య‌వ‌స్థ పూర్తిగా నిర్వీర్య‌మైన‌ట్లు ప‌లువురు బిల్డ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్లు అంటున్నారు. క‌ళ్ల ముందే అనేక సంస్థ‌లు యూడీఎస్ విధానంలో అక్ర‌మ అమ్మ‌కాలు జ‌రుపుతున్నా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శిస్తున్నాయి.

ఇత‌ర రాష్ట్రాల్ని చూసి..

దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో రెరా చ‌ట్టం స‌మ‌ర్థంగా ప‌ని చేస్తోంది. ఉల్లంఘ‌నులు ఎంత‌పెద్ద‌వారైనా విడిచి పెట్ట‌డం లేదు. ఆయా సంస్థల‌కు గ‌ల రాజ‌కీయ ప‌రిచయాల్ని కూడా ప‌ట్టించుకోకుండా త‌ప్పు చేస్తే జ‌రిమానాను విధిస్తున్నాయి. అవ‌స‌ర‌మైతే ప్రాజెక్టు లైసెన్సును ర‌ద్దు చేస్తున్నాయి. ఒక‌వేళ బిల్డ‌ర్ జ‌రిమానాను క‌ట్ట‌డానికి ముందుకు రాక‌పోతే, ఆయా ప్రాజెక్టు స్థ‌లం లేదా ఫ్లాటును విక్ర‌యించి అయినా ముక్కుపిండి వ‌సూలు చేస్తున్నాయి. కానీ, మ‌న ద‌గ్గ‌ర జ‌రుగుతున్న‌దేమిటి? ఒక్క‌సారి ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, గుజ‌రాత్ రెరా అథారిటీలు ఎంత మెరుగ్గా ప‌ని చేస్తున్నాయో తెలుసుకోవాలంటే..ఈ రెండు ఉదాహ‌ర‌ణల్ని నిశితంగా ప‌రిశీలించాల్సిందే.

సూప‌ర్‌టెక్ బిల్డ‌ర్స్‌పై రెరా ఫైన్‌

రెరా అథారిటీ ఉత్త‌ర్వుల్ని ఉల్లంఘించినందుకు ఓ రెరా అథారిటీ బ‌డా బిల్డ‌ర్ల‌పై జ‌రిమానా విధించింది. సూప‌ర్ టెక్‌, మ‌హాగున్‌, అన్స‌ల్ ప్రాప‌ర్టీస్‌, లాజిక్స్ ఇన్‌ఫ్రా వంటి సంస్థ‌ల‌పై మొత్తం రూ.1.24 కోట్ల జ‌రిమానా విధించింది. నివాస్ ప్ర‌మోట‌ర్స్‌, న్యూటెక్ ప్ర‌మోట‌ర్స్, ఐవీఆర్ ప్రైమ్ డెవ‌ల‌ప‌ర్స్‌, టీజీబీ రియాల్టీ వంటివీ ఈ జాబితాలో ఉన్నాయి. నెల రోజుల్లోపు ఈ బ‌కాయిల్ని చెల్లించాల‌ని ఆదేశించింది. లేక‌పోతే, ఆయా సంస్థ‌ల స్థ‌లాల నుంచి సొమ్మును రాబ‌డ‌తామ‌ని హెచ్చ‌రించింది. అన్స‌ల్ ప్రాప‌ర్టీస్‌కి చెందిన ఒక రిజిస్ట్రేష‌న్‌ను కూడా ర‌ద్దు చేసింది. అంత‌కంటే ముందు ఆయా కంపెనీకి షోకాజ్ నోటీసును జారీ చేసింది. దాదాపు నాలుగు నెల‌ల పాటు అవ‌కాశం ఇచ్చిన త‌ర్వాత తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రెరా అథారిటీ ఉల్లంఘ‌నుల‌పై కొర‌డా ఝ‌ళిపిస్తోంది.

దేవ్‌నంద‌న్ బిల్డ‌ర్‌పై జ‌రిమానా

గుజ‌రాత్‌కు చెందిన దేవ్‌నంద‌న్ బిల్డ‌ర్స్‌పై రెరా అథారిటీ కొర‌డా ఝ‌ళిపించింది. రెరాలో న‌మోదు చేయ‌కుండానే అపార్టుమెంట్ల‌ను బుక్ చేసినందుకు సుమారు రూ.27.39 ల‌క్షల జ‌రిమానాను విధించింది. బుకింగ్ ఎమౌంట్ ప‌ది శాతం కంటే ఎక్కువ వ‌సూలు చేసినందుకూ మ‌రో డెవ‌ల‌ప‌ర్‌పై క‌న్నెర్ర చేసింది. జ‌రిమానా విధించింది. దేవ్‌నంద‌న్ బిల్డ‌ర్స్ రెరా అనుమ‌తి తీసుకోకుండానే సుమారు 205 ఫ్లాట్ల‌ను అమ్మేశారు. మ‌రో కేసులో 45 మంది కొనుగోలుదారుల వ‌ద్ద నుంచి రూ.6.70 కోట్ల బుకింగ్ మొత్తాన్ని వ‌సూలు చేసినందుకు ద్వార‌క‌దాస్ ప్రీతామ‌ణిపై రూ. 7 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. ర‌విదీప్ అపార్టుమెంట్స్‌లో కొనుగోలుదారుల నుంచి ప‌ది శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని వ‌సూలు చేసినందుకు అక్క‌డి రెరా అథారిటీ క‌న్నెర్ర చేసి జ‌రిమానాను విధించింది.

మ‌రి, తెలంగాణ రాష్ట్రంలో రెరా అథారిటీ ఎప్పుడు ఇలా క‌ట్టుదిట్టంగా వ్య‌వ‌హ‌రిస్తుందోన‌ని అధిక శాతం కొనుగోలుదారులు ఆత్రుత‌తో ఎదురు చూస్తున్నారు. గ‌త రెండేళ్ల నుంచి కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు, రియ‌ల్ట‌ర్లు, ఏజెంట్లు చేస్తున్న అక్ర‌మ వ‌సూళ్ల‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌ని వీరంతా కోరుకుంటున్నారు. ఇప్ప‌టికైనా రాష్ట్ర ప్ర‌భుత్వం తెలంగాణ రెరా అథారిటీ ఛైర్మన్ గా ఒక ఉన్న‌తాధికారిని ప్ర‌త్యేకంగా నియ‌మించాల‌ని తెలంగాణ నిర్మాణ సంస్థ‌లు కోరుతున్నాయి. లేదా ప‌ద‌వీవిర‌మ‌ణ చేసిన రాజేశ్వ‌ర్ తివారికి అయినా మ‌ళ్లీ ఆ పోస్టును అప్ప‌చెబితే తెలంగాణ నిర్మాణ రంగాన్ని గాడిలో ప‌డుతుంది. లేక‌పోతే, ఇలాగే గాలికి వ‌దిలేస్తే.. అక్రమ అమ్మ‌కాల‌కు హైద‌రాబాద్ దేశంలోనే కేరాఫ్ అడ్ర‌స్‌గా మారే ప్ర‌మాద‌ముంద‌ని ప‌లువురు డెవ‌ల‌ప‌ర్లు హెచ్చ‌రిస్తున్నారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles