- * 5 కోట్లు పెడితే 2 ఏళ్లలో డబుల్!
- * రియల్ ఏజెంట్ల మాయ..
- * ఫ్లాట్లు అమ్మితే బంగారం, బుల్లెట్లు, కార్లు
హైదరాబాద్ నిర్మాణ రంగంలో మళ్లీ కొందరు అక్రమార్కులు ప్రవేశించారు. గత కొంతకాలం నుంచి స్తబ్దుగా ఉన్న వీరంతా అమాయకుల్ని వేటాడే పనిలో పడ్డారు. ఎవరైనా కోటి రూపాయలు పెట్టుబడి పెడితే రెండేళ్లలోనే సొమ్ము రెట్టింపు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలని.. విల్లా ప్రాజెక్టుల్ని చేపడుతున్నామంటూ మార్కెట్లో తెగ తిరిగేస్తున్నారు. ఇప్పుడు స్థలం కొనుక్కుంటే ఉత్తమం అని.. విల్లాలు ఆరంభమైతే ధర పెరుగుతుందని గాలమేస్తున్నారు. కాబట్టి, తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి మోసగాళ్ల బారిన పడకండి.
పటాన్ చెరు వద్ద ఇంద్రేసం.. ఒక సంస్థ విల్లా ప్రాజెక్టును ఆరంభిస్తోంది.. రూ.5 కోట్లు పెట్టుబడి పెడితే రెండేళ్లలో రెట్టింపు ఇస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. స్థల సేకరణ జరిగేది ఎప్పుడు? అనుమతి వచ్చేదెప్పుడు?
మార్కెటింగ్ చేసేదెన్నడు? ఇవన్నీ ఎప్పటికీ కావాలి? ఇలాంటి వాస్తవిక పరిస్థితులతో సంబంధం లేకుండానే..
పెట్టుబడి పెడితే సొమ్ము రెట్టింపు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. ఇలాంటి మోసపూరిత వాగ్దానాల పట్ల జాగ్రత్త వహించాలి. అత్యాశకు పోయి సొమ్మును అందులో పోశారో.. కష్టాన్ని మీరే సొమ్ములు పోసి కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.
* సుల్తాన్ పూర్‌లో మూడేళ్ల క్రితం కొందరు అమాయకులు ఇలాగే ఒక అక్రమార్కుల చేతిలో పడ్డారు. ఇలాంటి వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. మూడేళ్లయినా ఇప్పటికీ ఆ వెంచర్ అనుమతి లేదు. హెచ్ఎండీఏ అనుమతి తీసుకోలేదు.. కాకపోతే, ఈ మూడేళ్లలో ధర మాత్రం అనూహ్యంగా పెరిగేసింది. ఇప్పుడు ఇందులో ఇరుక్కుపోయిన వారు లబోదిబోమంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక, ఎవరికీ చెప్పుకోలేక.. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. రెరా నుంచి అనుమతి తీసుకోకుండా.. యూడీఎస్ విధానంలో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించే అక్రమ వ్యాపారం మళ్లీ హైదరాబాద్‌లో ఆరంభమైంది. నిన్నటివరకూ అధిక శాతం మంది డెవలపర్లు వీటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడేంటో నోటికి ఏది వస్తే అది చెప్పేస్తున్నారు.
పోచారంలో ఏమిటీ మాయ?
పోచారంలో పది ఎకరాల్లో పద్నాలుగు అంతస్తుల ఎత్తులో 952 ఫ్లాట్లను నిర్మించేందుకు ఒక సంస్థ ప్రణాళికల్ని రచించింది. అందులో ఎనిమిది టవర్లు, 40 వేల చదరపు అడుగుల్లో క్లబ్ హౌజ్ వంటివి నిర్మిస్తారని ప్రచారం చేస్తోంది. డెవలపర్ ఎవరో తెలియదు. అతనికి పూర్వాశ్రమంలో ఈ రంగంలో అనుభవం ఉందా? లేదా? అనే విషయం తెలియదు. ఇంటర్నెట్ నుంచి కొన్ని ఫోటోలు తీసుకుని.. ఒక పేరు పెట్టి.. చదరపు అడుక్కీ రూ.2,799కే విక్రయిస్తామంటూ కొందరు ఏజెంట్లు స్పెషల్ ఆఫర్ అంటూ అమ్ముతున్నారు.
రెరా వచ్చిన తర్వాత ఇందులో ఫ్లాటు కొనేందుకు రూ.46 లక్షలు అవుతుందట. ప్రస్తుతమైతే కేవలం 32 లక్షలకే అందజేస్తామని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. పైగా, మార్కెటింగ్ చేసేవారికి ఆకర్షణీయమైన బహుమతుల్ని ప్రకటించారు. ఒక ఫ్లాటు అమ్మితే నాలుగు గ్రాముల బంగారం ప్లస్ ల్యాప్‌టాప్ అందజేస్తారట. రెండు ఫ్లాట్లను అమ్మిపెడితే 10 గ్రాములు బంగారంతో పాటు బుల్లెట్, ఐదు ఫ్లాట్లను విక్రయిస్తే మూడు తులాల బంగారంతో పాటు రెనాల్ట్ క్విడ్ కారు, 10 ఫ్లాట్లను అమ్మితే ఏడున్నర తులాల బంగారంతో పాటు కియా సోనెట్ కారును కూడా అందజేస్తారట. మార్కెట్ ఏజెంట్లకు ఇంత మంచి నజరానా అందిస్తున్నారంటే.. వీరు నిజంగానే కడతారా? అనే సందేహం ఎవరికైనా కలగమానదు.