హైదరాబాద్‌లో పలు నిర్మాణ సంస్థలు నాలా ఛార్జీల సమస్యను ఎదుర్కొంటున్నాయి. హెచ్ఎండీఏ అనుమతినిచ్చేటప్పుడు నాలా ఛార్జీలను చెల్లించాక తనఖాను విడుదల చేయించుకోమని ఐదు శాతం అధిక స్థలాన్ని మార్టిగేజ్ తీసుకున్నాయి. కాకపోతే, ప్రస్తుతమేమో ఎమ్మార్వో కార్యాలయంలో నాలా ఛార్జీల్ని తీసుకోవడం లేదు. అలాగని ఆన్‌లైన్‌లో చేయిద్దామంటే కుదరడం లేదు. ఎందుకంటే, ఆయా భూమి నేటికీ పాత యజమానుల పేర్ల మీదే ఉండటం వల్ల ఈ కొత్త సమస్య పుట్టుకొస్తుందని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. ఈ సమస్యను పలు కంపెనీలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. హెచ్ఎండీఏ వద్ద మూడు శాతం నాలా ఛార్జీలను చెల్లించేందుకు అనుమతించాలని కోరాయి. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.
జీహెచ్ఎంసీ పరిధిలో నాలా ఛార్జీల గురించి ఎలాంటి సమస్యల్లేవు. ఇబ్బందల్లా హెచ్ఎండీఏలోనే. ఎకరాలో ఓ పది గుంటలు మిగిలిపోతే.. సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయడం లేదని పలువురు బిల్డర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా కుత్బుల్లాపూర్లో ఈ సమస్య ఎక్కువుందని వాపోతున్నారు. నాలా ఛార్జీలను కట్టమని ఎమ్మార్వో చెబుతుండగా.. ఆన్‌లైన్‌లో మాత్రం ఈ రుసుమును చెల్లించడం సాధ్యం కావడం లేదు. కారణం.. ధరణి పోర్టల్‌లో అప్‌డేట్ కాకపోవడమే. దీని వల్ల చిన్న చిన్న బిల్డర్లకు హైదరాబాద్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి కారణం.. ఆయా స్థలం నేటికీ పాత యజమాని పేరు మీద ఉండటమే. ఉదాహరణకు, ఒక స్థలాన్ని నలుగురు అన్నదమ్ములు పంచుకున్నారనుకుందాం. అందులో కొంత భూమిలో అపార్టుమెంట్ కట్టేందుకు అనుమతి కోసం వెళితే.. నాలా ఛార్జీలను కట్టమంటున్నారు. సబ్ రిజిస్ట్రార్ వద్దకెళితేనేమో ఎమ్మార్వో వద్ద నాలా ఛార్జీల్ని కట్టమని చెబుతున్నారు. అక్కడికి వెళితేనేమో ఆన్‌లైన్‌లో చెల్లించమని చెబుతున్నారు. సరే అని ఆన్‌లైన్‌లోకి వెళితే.. పహాణీలో నేటికీ పాత యజమాని పేరే కొనసాగుతోంది. కొత్తగా చేసుకున్న విభజన పత్రం ఇంకా రిజిస్ట్రేషన్ విభాగంలో రిజిస్టర్ కాకపోవడమే కారణం.
గతంలో ఎలా ఉండేదంటే.. పది కుంటల స్థలాన్ని డెవలప్‌మెంట్ కింద ఒప్పందం కుదుర్చుకుంటే.. డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ రిజిస్టర్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఆ డాక్యుమెంట్ మీద ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లి నాలా ఛార్జీలను కట్టేసేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి జఠిలమైంది. అసలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కూడా చేయడం లేదు. కుత్బుల్లాపూర్‌లో ఇలాంటి దుస్థితి ఎక్కువగా కనిపిస్తోందని సమాచారం. దీనికి పరిష్కారం.. సీఎస్సే చెప్పాలని నిర్మాణ సంస్థలు అంటున్నాయి.