నోయిడాలోని సూపర్ టెక్ ట్విన్ టవర్ల కూల్చివేత ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. ఆగస్టు 2 నుంచి 20 వరకు ఈ వంద మీటర్ల పొడవైన భవనం నిండా పేలుడు పదార్థాలు అమర్చే ప్రక్రియ జరుగుతుంది. అనంతరం ఆగస్టు 21 మధ్యాహ్నం 2.30 గంటలకు ఆ బాంబులను పేల్చడం ద్వారా ట్విన్ టవర్లను నేలమట్టం చేస్తారు. ఈ మేరకు ఈ కూల్చివేత ప్రక్రియ పనులు చేపట్టిన ఎడిఫిస్ ఇంజనీరింగ్ సంస్థ వివరాలను నోయిడా అథార్టీకి తెలియజేసింది. ట్విన్ టవర్లలో పేలుడు పదార్థాలు అమర్చేటప్పుడు ఆ సంస్థ సిబ్బంది మినహా ఇతరులు ఎవరినీ అక్కడకు అనుమతించబోమని అధికారులు వెల్లడించారు.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్విన్ టవర్లను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అపెక్స్, సియానే అనే పేర్లున్న ఆ జంట భవనాల కూల్చివేత ప్రక్రియపై సూపర్ టెక్ ప్రతినిధులు, ఎడిఫిస్ ఇంజనీరింగ్, యూపీ కాలుష్య నియంత్రణ బోర్డు, అగ్నిమాపక విభాగం అధికారులు, స్థానిక పోలీసులు సమావేశమై చర్చించారు.
నోయిడా అథార్టీ సీఈఓ రీతూ మహేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కూల్చివేత ఎలా నిర్వహిస్తామనే విషయాన్ని ఎడిఫిస్ ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. ‘వివిధ అంతస్తుల్లోని పిల్లర్లలో పేలుడు పదార్థాలు అమర్చాల్సిన చోట రంధ్రాలు చేయడం పూర్తయింది. ఆగస్టు 2 నుంచి 20 వరకు భవనంలో అవసరమైన చోట్ల పేలుడు పదార్థాలు నింపుతారు. ఆ సమయంలో ఎడిఫిస్ ఇంజనీరింగ్ సంస్థ సిబ్బందిని తప్ప ఎవరినీ అనుమతించబోం’ అని నోయిడా అథార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. కూల్చివేతను రికార్డు చేసేందుకు సీసీ టీవీ కెమెరాలు వినియోగించనున్నారు.
This website uses cookies.