Categories: TOP STORIES

భారత రియల్ రంగానికి ఎన్నారైల మద్ధ‌తు..

పెద్ద ప్రాజెక్టులో
పావు వంతు వాటా వారిదే

భారత రియల్ రంగానికి ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) దన్నుగా నిలుస్తున్నారు. పెద్ద పెద్ద డెవలపర్లు చేపడుతున్న ప్రాజెక్టుల్లో జరుగుతున్న మొత్తం అమ్మకాల్లో పావు వంతు వాటా వీరిదే. కరోనాకు ముందు ఇది 7 నుంచి 10 శాతం మధ్యలో ఉండగా.. ఇప్పుడది ఏకంగా 25 శాతానికి పెరిగింది. ఫలితంగా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్లకు డిమాండ్ పెరగడంతో ధరలు కూడా ఆ మేరకు పెరుగుతున్నాయి. ఎన్నారైలకు అమెరికా, సింగపూర్, యూఏఈ, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియాలు పెద్ద మార్కెట్లుగా ఉన్నాయి. తాజాగా భారత్ లో కూడా ఎన్నారైల పెట్టుబడులు పెరిగాయి.

దేశంలోని అతిపెద్ద డెవలపర్ అయిన డీఎల్ఎఫ్ గురుగ్రామ్ లో చేపట్టన ప్రివానా ప్రాజెక్టులో జరిగిన అమ్మకాల్లో 25 శాతం వాటా ఎన్నారైలదే. దీని విలువ దాదాపు రూ.1800 కోట్లు ఉంటుంది. మొత్తమ్మీద 2023-24లో డీఎల్ఎఫ్ కి సంబంధించి జరిగిన అమ్మకాల్లో రూ.3400 కోట్లు ఎన్నారైల నుంచి వచ్చింది. ఇది డీఎల్ఎఫ్ మొత్తం అమ్మకాల విలువలో దాదాపు 20 శాతం కావడం గమనార్హం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత రియల్ మార్కెట్లోకి వచ్చిన పెట్టుబడుల్లో దాదాపు 10 శాతం ఎన్నారైలవేనని గణాంకాలు చెబుతున్నాయి. తర్వాత కాలంలో ఇది మరింత పెరిగిందని అంచనా. ముఖ్యంగా దుబాయ్, అబుదాబీ, లండన్, సింగపూర్, హాంకాంగ్, అమెరికాల్లో ఉంటున్న ఎన్నారైలు భారత్ లో పెట్టబడులు పెట్టడానికి అధికంగా ముందుకొస్తున్నారు. మన రియల్ రంగంలో దాదాపు 20 శాతం వాటాతో కీలకంగా వ్యవహరిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

వచ్చే రెండేళ్లలో మనదేశంలోని లగ్జరీ రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది ఎన్నారైలు యోచిస్తున్నట్టు ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. స్వదేశంలోని పెద్ద పెద్ద ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనువైన సమయంగా వారు భావిస్తున్నట్టు అందులో వెల్లడైంది. భారత రూపాయి విలుతో పోలిస్తే.. అమెరికా డాలర్ పెరుగుతుండటం వారికి బాగా కలిసొస్తున్న అంశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా తర్వాత రెసిడెన్షియల్ మార్కెట్ లో ఎన్నారైల వాటా రెట్టింపు అయింది.

This website uses cookies.