- ముంబై నారిమన్ పాయింట్లో ఆఫీస్ స్పేస్ కు రూ.2650 కోట్లు ఇస్తామన్న రిజర్వ్ బ్యాంకు
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దక్షిణ ముంబైలో తన ప్రధాన కార్యాలయాన్ని విస్తరించే ప్రణాళికలో భాగంగా నారిమన్ పాయింట్ వద్ద 4.12 ఎకరాల ప్లాట్ ను దీర్ఘకాలిక లీజు తీసుకోవడానికి భారీ ఆఫర్ ఇచ్చింది. ఈ ప్లాట్ ఇచ్చేందుకు గానూ ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్సీఎల్)కు రూ.2650 కోట్లు ఇస్తామని పేర్కొంది. 1.6 మిలియన్ చదరపు అడుగుల అభివృద్ధి సామర్థ్యం కలిగిన ఈ ప్లాట్ లో 1,13,500 చదరపు అడుగుల మేర స్థలాన్ని పునరావాస కార్యకలాపాల కోసం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. ఎంఎంఆర్సీఎల్ ఈ ప్లాట్ ను గతేడాది అక్టోబర్ లో అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ద్వారా 90 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఆర్బీఐ దీనిని లీజుకు తీసుకోవాలని నిర్ణయించి, ఈ మేరకు సంప్రందింపులు ప్రారంభించింది. తాము ఆఫర్ చేసిన మొత్తం ఎంఎంఆర్సీఎల్ ఆశించిన దాని కంటే 25 శాతం ఎక్కువ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఈ ప్లాట్ కు సెంట్రల్ బ్యాంకు రూ.5,173 కోట్లు ఆఫర్ చేసిందనే విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా.. ఇది నిర్మాణాలతో సహా మొత్తం ప్రాజెక్టు వ్యయమని పేర్కొన్నారు. వాస్తవానికి ఎంఎంఆర్సీఎల్ రూ.2వేల కోట్ల లోపు ఆదాయాన్ని అంచనా వేసుకుందని వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఆఫర్ చేసిన రూ.2650 కోట్ల మొత్తం.. 25 శాతం ఎక్కువనని చెప్పారు. దీనికి సంబంధించి ఇరు వర్గాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు.