అనుమతి లేని లేఔట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం నుంచి ఏపీ సర్కారు వెనక్కి తగ్గింది. ఆదాయం పెంచుకునే అంశాల్లో భాగంగా ఆయా లేఔట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మార్గదర్శకాలు సవరించనుంది.
2020 జనవరి తర్వాత ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వేసిన లేఔట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లను ఏపీ సర్కారు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 19వేలకు పైగా లేఔట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దాదాపు ఐదు నెలలుగా రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో ఆ మేరకు ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో అక్రమ లేఔట్లకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించడం ద్వారా వాటి క్రమబద్ధీకరణకు అనుమతించాలని.. తద్వారా రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు సవరణ మార్గదర్శకాలు ఇవ్వాలని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. గతంలో మున్సిపల్ ప్రాంతాల్లోని లేఔట్లలో 40 అడుగుల రోడ్లు ఉండాలని నిర్దేశించగా.. దానిని 30 అడుగులకు తగ్గించనున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతల్లో 10 నుంచి 15 అడుగుల రోడ్లు ఉన్నా క్రమబద్దీకరించనున్నారు. ఈ మేరకు త్వరలోనే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదేశాలు ఇవ్వనున్నారు. దీంతో ఫిబ్రవరిలో నిలిచిపోయిన ఈ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు త్వరలోనే మొదలు కానున్నాయి. గతేడాది స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.7,300 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది రూ. 10వేల కోట్లు రావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
This website uses cookies.