భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో మనదేశంలో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు తగ్గాయి. గతేడాది తొలి అర్ధభాగంతో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 4 శాతం మేర క్షీణించి 2.3 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు అనరాక్ నివేదిక వెల్లడించింది. పీఈ పెట్టుబడులు అంతర్జాతీయ, విదేశీ పెట్టుబడిదారుల నుంచి వస్తాయని, ప్రస్తుతం అంతర్జాతీయ సమస్యలైన అధిక వడ్డీ రేట్లతోపాటు భౌగోళిక వివాదాల వంటి అంశాలు వీటిపై ప్రభావం చూపి పెట్టుబడుల్లో క్షీణత నమోదైందని అనరాక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శోభిత్ అగర్వాల్ పేర్కొన్నారు.
అయితే, మొత్తమ్మీద పెట్టుబడుల సంఖ్య, భారతీయ మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారుల బలమైన ఉనికి స్థిరంగా ఉండటంతోపాటు రిలయన్స్ రిటైల్ ల ఏడీఐఏ, కేకేఆర్ పెట్టుబడుల ఫలితంగా ఆశావహ దృక్పథం కొనసాగుతోందని వివరించారు. కాగా, సగటు లావాదేవీ పరిమాణం ప్రతి ఏటా 23 శాతం పెరుగుతోంది.
2020-21 మొదటి అర్ధ భాగంలో పీఈ పెట్టుబడులు 1.2 బిలియన్ డాలర్లు కాగా, 2021-22లో అదే కాలానికి 2 బిలియన్ డాలర్లకు, తదుపరి ఆర్థిక సంవత్సరానికి 2.8 బిలియన్ డాలర్లకు, ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో 2.4 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో గత మూడేళ్లలో మొదటి పతనం కనిపించింది. ఈ పీఈ పెట్టుబడులు ప్రధానంగా రిలయన్స్, ఏడీఐఏ, కేకేఆర్ మధ్య పెద్ద గిడ్డంగుల ఒప్పందం కారణంగా ఉన్నాయి. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో మొత్తం పెట్టుబడులలో 67శాతం కావడం గమనార్హం.
పారిశ్రామిక, లాజిస్టిక్స్ ప్రాపర్టీలు మొత్తం పెట్టుబడుల్లో 67 శాతం వాటాతో ఉండగా.. ఆఫీసు, రెసిడెన్షియల్ రంగాలు 17 శాతం మాత్రమే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఆఫీస్ విభాగంలో పీఈ పెట్టుబడులు 79 శాతం తగ్గగా.. పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులు 378 శాతం పెరిగాయి.
This website uses cookies.