జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు తీసుకున్న ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బందులుండవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని.. హైదరాబాద్ అభివృద్ధిలో బిల్డర్లు భాగస్వామ్యులని.. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అవతరించేందుకు ప్రభుత్వంతో పాటు బిల్డర్లు కలిసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మాణ రంగం ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు.
తెలంగాణ నిర్మాణ రంగానికి చెందిన సంఘాలన్నీ కలిసి కట్టుగా ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ రంగం ఎదుర్కొనే సమస్యల జాబితాను సిద్ధం చేస్తే.. నెలకు ఒకట్రెండు సార్లు సమావేశమై.. ఆయా ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కస్టమర్లు, బ్యాంకర్లు ఆందోళన చెందాల్సిన పనే లేదు. బిల్డర్లంతా నిశ్చింతగా తమ నిర్మాణ పనుల మీద దృష్టి సారించాలన్నారు. నరెడ్కో ప్రాపర్టీ షోకు హాజరయ్యేందుకు ఢిల్లీలో ముఖ్య కార్యక్రమాన్ని రద్దు చేసుకుని వచ్చానని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం నిర్మాణ రంగమెంతో కష్టపడిందన్నారు.
హైదరాబాద్లో ఓఆర్ఆర్ ని అప్పటి కాంగ్రెస్ పూర్తి చేసింది. ట్రిపుల్ ఆర్ కూడా మేమే పూర్తి చేస్తాం. అదేవిధంగా, ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకూ రేడియల్ రోడ్లతో పాటు మెట్రో రైలును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. మంచి నీటి కొరత లేకుండా చూస్తాం. ఫ్యూచరిస్టిక్ సిటీ, ప్రపంచస్థాయి స్కిల్ యూనివర్శిటీ, స్పోర్ట్స్ యూనివర్శిటీ వంటి వాటితో గ్లోబల్ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు.
తాను హైదరాబాద్‌లో పుట్టి పెరిగానని.. పంజాగుట్టలో తమకు వ్యవసాయ భూమి ఉండేదన్నారు. రియల్ ఎస్టేట్ నగరాభివృద్ధికి గ్రోత్ ఇంజన్ వంటిదన్నారు. అరవై శాతం ఆదాయం రియల్ రంగం నుంచే వస్తుందని తెలిపారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, మెరుగైన శాంతిభద్రతలను అందజేసి.. రియల్ రంగం అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని చెప్పారు. ప్రతి స్టాల్‌ను సందర్శించి.. వారిని అడిగితే.. అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ గవర్నమెంట్.. ప్రో యాక్టివ్, ఇంటరాక్టివ్, ఫ్రెండ్లీ, డెమెక్రటిక్, బిజినెస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. బిల్డర్లతో కలిసి హైదరాబాదాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళతామన్నారు.
నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ విజయ సాయి మేకా మాట్లాడుతూ, “హైదరాబాద్ అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తోంది. దాని ఫలితాలను రియల్ ఎస్టేట్ రంగం పొందుతోంది. కొనసాగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి, మెరుగైన అనుసంధానతతో, నగరంలోని సబ్‌మార్కెట్లు అభివృద్ధి చెందుతున్నాయి. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం లేదన్నారు. సెక్రటరీ జనరల్ కె. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రాపర్టీ షోలో ప్రదర్శించే అన్ని ప్రాపర్టీలు రెరా-సర్టిఫైడ్, ప్రతి పెట్టుబడి నిర్ణయంలో పారదర్శకత మరియు విశ్వసనీయతను నిర్ధారిస్తాయన్నారు. నారెడ్కో తెలంగాణ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కాళీ ప్రసాద్ దామెర, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా. వై.కిరణ్, కోశాధికారి ఆర్.వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
This website uses cookies.