హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) కోకాపేట్ లే అవుట్ లో భూముల Kokatpet Neopolis ఈ – ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపధ్యంలో దీనిని సాకుగాచూపి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ‘సిఎన్ఎన్ వెంచర్స్’ అనే సంస్థపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సిసిఎస్) పోలీసులు ఎఫ్ఐఆర్(104/2021) నమోదు చేశారు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్టిసి లిమిటెడ్ ద్వారా జరుగుతున్న కోకాపేట్ భూముల ఈ–ఆక్షన్ ప్రక్రియ పూర్తికాకముందే ప్రజలను మభ్యపెట్టేవిధంగా సదరు సిఎన్ఎన్ వెంచర్స్ కొన్ని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి వంచనకు గురిచేస్తున్న తీరును హెచ్ఎండిఏ తీవ్రంగా పరిగణించింది.
కోకాపేట్ భూములను మార్కెట్ విలువలో యాబై శాతం(50%) పెట్టుబడులతో 1,500 చదరపు అడుగుల వరకు 3బిహెచ్కె ఫ్లాట్ లను సొంతం చేసుకోవచ్చని సిఎన్ఎన్ వెంచర్స్ ప్రకటనలద్వారా అమాయక ప్రజలను వంచనకు గురిచేస్తున్నది.
ఒకవైపు కోకాపేట్ భూముల ఈ–ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతుండగా, తక్కువ ధరలకు/రేట్లకు పెట్టుబడులు పెట్టి 3బిహెచ్కె ఫ్లాట్లను కొనుగోలు చేసుకోవచ్చని సామాన్య ప్రజానీకాన్ని ప్రభావితం చేసే విధంగా వ్యవహరించి ప్రజల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న సిఎన్ఎన్ వెంచర్స్ పై చర్యలు తీసుకోవాలని హెచ్ఎండిఏ సెక్రెటరీ, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) ప్రాజెక్టు డైరెక్టర్ సంతోష్ ఐఏఎస్ శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
హెచ్ఎండిఏ భూముల వేలం పూర్తికాకముందే నిర్ణిష్టమైన అనుమతులు లేకుండానే అమాయక ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరిస్తున్న సీఎన్ఎన్ వెంచర్స్ పై కఠిన చర్యలు తీసుకుని హెచ్ఎండిఏ ప్రతిష్టతను కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇలాంటి వ్యాపార ప్రకటనలను, లావాదేవీలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు విశ్వసించరాదని హెచ్ఎండిఏ సూచించింది.
This website uses cookies.