Categories: LATEST UPDATES

కోకాపేట్ వేలం సూపర్ హిట్‌?

కోకాపేట్‌లో ప్ర‌భుత్వం నిర్వ‌హించ త‌ల‌పెట్టిన వేలం (Kokapet Land Auction) పాట‌కు చ‌క్క‌టి ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని స‌మాచారం. దీంతో హెచ్ఎండీఏ ఉన్న‌తాధికారులు ఆనందంతో మునిగిపోయిన‌ట్లుగా తెలిసింది. కోకాపేట్‌లో ఏడు ఎక‌రాల‌కు పైగా విస్తీర్ణం గ‌ల ఏడు ప్లాట్ల‌తో పాటు గోల్డ‌న్ మైల్‌లో మిగిలిపోయిన ఒక చిన్న ప్లాటును హెచ్ఎండీఏ వేలం వేయ‌డానికి రంగం సిద్ధం చేసింది. ఎక‌రాకు క‌నీస ధ‌ర రూ.25 కోట్లుగా హెచ్ఎండీఏ నిర్ణ‌యించిన విషయం తెలిసిందే.

కోకాపేట్ గ‌చ్చిబౌలి, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్టుకు ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం.. ఇక్క‌డ్నుంచి ఎయిర్ పోర్టుకు సులువుగా చేరుకునే వీలుండ‌టం.. ఇక్క‌డ ప్ర‌భుత్వం ట్రంపెట్ నిర్మాణానికి పూనుకోవ‌డం.. ట్రాఫిక్ స‌మ‌స్య ఏర్ప‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం.. ఇలాంటి అనేక అంశాల వ‌ల్ల భ‌విష్య‌త్తులో కోకాపేట్ అనూహ్యంగా అభివృద్ధి చెంద‌డానికి అవ‌కాశం ఉంద‌ని ప‌లు ఫార్మా సంస్థ‌లు గుర్తించాయి. పైగా, ప్ర‌భుత్వం ఫార్మా కారిడార్ కు శ్రీకారం చుట్ట‌డం.. కొవిడ్ నేప‌థ్యంలో అధిక వ్యాపారాన్ని నిర్వ‌హించడంతో.. కోకాపేట్ స్థ‌లాన్ని వేలం పాట‌లో సొంతం చేసుకునేందుకు ముందుకొచ్చాయ‌ని తెలిసింది.

హైద‌రాబాద్ త‌ప్ప‌.. దేశంలో ఎక్క‌డ చూసినా రియ‌ల్ రంగం కునారిల్లుతోంది. అందుకే, అధిక లాభాల్ని
ఆర్జించాల‌ని భావించే రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌లు, రియ‌ల్ ఎస్టేట్ ఫండ్లు, రీట్లు వంటివి ఆస‌క్తి చూపిస్తున్నాయి. అంత‌ర్జాతీయ కంపెనీల‌కు డాల‌ర్ల‌తో పోల్చితే మ‌న రూపాయి విలువ త‌క్కువే కాబ‌ట్టి.. కోకాపేట్‌లో అడుగుపెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌లు ఎంఎన్‌సీ సంస్థ‌లు బిడ్లు వేశాయ‌ని.. నిర్థారిత గ‌డువులోపు మ‌రిన్ని కంపెనీలు ఇందులో పాల్గొంటాయ‌ని హెచ్ఎండీఏ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఎంత‌లేద‌న్నా వేలంలో ఎక‌రాకు రూ.40 కోట్ల‌కు పైగా ధ‌ర ప‌లికే అవ‌కాశ‌ముంద‌ని తెలిసింది.

This website uses cookies.