నిర్మాణ రంగంలో విపరీతమైన మార్పులు వచ్చేశాయ్. సంప్రదాయ పద్ధతుల స్థానంలో సాంకేతికత రాజ్యమేలుతుంది ఇప్పుడు. ఆస్తుల రూపకల్పన, నిర్మాణాలు, రీసెర్చ్, కొనుగోలు- విక్రయాలు వంటి వాటిని ప్రాప్‌టెక్ సొల్యూషన్స్ విప్లవాత్మకంగా మార్చేశాయ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాల్టీ, బ్లాక్ ఛైయిన్, మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ అంటూ లేటెస్ట్ టెక్నాలజీని మిగిలిన రంగాలతో పాటు రియాల్టీ సెక్టార్ కూడా అందిపుచ్చుకోవడంతో నిర్మాణరంగం తీరు గణనీయంగా మారిపోయింది.
ఎర్నెస్ట్ అండ్ యంగ్ అంచనా ప్రకారం 2023లో మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్ వాటాలో ప్రాప్‌టెక్ బేస్డ్ సొల్యూషన్స్ వాటా 10.5 బిలియన్ డాలర్లుగా ఉంది. రియాల్టీ మార్కెట్ సైజ్‌తో పొల్చితే ఈ స్టేక్ 5 శాతం కంటే తక్కువే అయినప్పటికీ భవిష్యత్‌లో పుంజుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఎందుకంటే ఫ్యూచరంతా టెక్నాలజీదే. నిర్మాణ రంగం సైతం తప్పనిసరిగా సాంకేతికత ఆధారంగానే తమ కార్యకలాపాలు కొనసాగించి తీరాల్సిన పరిస్థితి. కాబట్టి కన్‌స్ట్రక్షన్ సెక్టార్‌లో ప్రాప్‌టెక్ వాటా గణనీయంగా పెరగడం గ్యారంటీ అంటున్నారు మార్కెట్ ఎక్స్‌పర్ట్స్.