Categories: LEGAL

భూమి ఇచ్చాక.. ఏళ్ల పాటు న్యాయపోరాటం!

  • వారికి ప్లాట్లు కేటాయించాలని పంజాబ్ హైకోర్టు ఆదేశం
  • కేటాయించిన ప్లాట్లనూ ఈ వేలంలో పెట్టిన హెచ్ఎస్ వీపీ

భూసేకరణ కింద వారంతా తమ భూములిచ్చారు. అందుకు పరిహారంతోపాటు ఆ భూములను అభివృద్ధి చేసిన తర్వాత వారికి ప్లాట్లు రావాల్సి ఉంది. కానీ అవి రాకపోవడంతో ఏళ్లపాటు కోర్టులో న్యాయపోరాటం చేశారు. తీరా కోర్టులో అనుకూలంగా తీర్పు వెలువడి కొన్ని ప్లాట్లు దక్కించుకున్నారు. కాగా, ప్రస్తుతం వాటిని కూడా ఈ వేలంలో పెట్టడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుర్గావ్ లోని 4, 5, 6, 9, 10, 22, 23 సెక్టార్లను అభివృద్ధి చేయడం కోసం హర్యానా షేహ్రి వికాస్ ప్రాధికరన్ (హెచ్ఎస్ వీపీ) 1981 నుంచి 2000 మధ్యకాలంలో దాదాపు 1500 మందికి పైగా రైతుల నుంచి వందలాది ఎకరాల భూమిని సమీకరించింది. ఇందుకు వారికి పరిహారం చెల్లించడమే కాకుండా ఆ భూముల్లో ప్లాట్లు కేటాయిస్తామని పేర్కొంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో రైతులు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించారు.

అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు రైతులకు ప్లాట్లు కేటాయించడం కోసం 2013లో హెచ్ఎస్వీపీ ఓ విధానం తీసుకొచ్చింది. దీని ప్రకారం భూమి ఇచ్చిన రైతులు దరఖాస్తు చేసుకుంటే మార్కెట్ ధరకు ప్లాట్ కేటాయిస్తామని పేర్కొంది. ఇందుకు 370 ప్లాట్లు రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో 2018లో 916 దరఖాస్తులు రాగా, 154 మంది అర్హులుగా గుర్తించింది.

వీరిలో ఎస్టేట్ ఆఫీస్-1 కింద 38 మందికి ప్లాట్లు కేటాయించింది. మరోవైపు ఇదే సమయంలో ఆ 370 ప్లాట్లలో 66 ప్లాట్లను ఈ వేలానికి ఉంచింది. అంతేకాకుండా 38 మందికి కేటాయించిన ప్లాట్లలో సైతం కొన్నింటిని వేలానికి పెట్టింది. దీనిపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ వేలం రద్దు చేసి తమ ప్లాట్లు తమకు ఇవ్వాలని కోరుతున్నారు.

This website uses cookies.