Categories: LATEST UPDATES

ఇక ‘రియల్’ వేగమేనా?

  • వచ్చే మూడేళ్లలో పుంజుకునేనా?
  • 75 శాతానికి పైగా పెరుగుదల?
  • తాజా అధ్యయనంలో వెల్లడి

కార్మికుల కొరత, తక్కువ బడ్జెట్ వంటి కారణాలతో కోవిడ్-19 కాలంలో బాగా దెబ్బతిన్న రియల్ ఎస్టేట్ రంగం ఇప్పడు వేగం పుంజుకుందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. ప్రస్తుతం ఆరోగ్యకరమైన మార్గంలో ఇది దూసుకుపోతోందని తెలిపింది. సెబీ రిజిస్టర్డ్ కంపెనీ అయిన ఇన్ఫమెరిక్స్ వాల్యుయేషన్ అండ్ రేటింగ్ ప్రైవేటు లిమిటెడ్ విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. వచ్చే మూడేళ్లలో రియల్ రంగంలో అభివృద్ధి 75 శాతానికి పైగా నమోదయ్యే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. ఇక 2021 సెప్టెంబర్ త్రైమాసికంలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీల్లో గణనీయమైన పురోగతి సాధించినట్టు తెలిపింది. ముఖ్యంగా ఈ కాలంలో ఐటీ రంగమే అతిపెద్ద స్పేస్ వినియోగదారుగా ఉన్నట్టు వివరించింది. మొత్తం లావాదేవీల్లో ఐటీ రంగానికి 34 శాతం ఉన్నట్టు పేర్కొంది.

ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యలతో పాటు గృహరుణాలకు సంబంధించి వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, సరసమైన ధరలో లభించే గృహ ప్రాజెక్టులకు పన్ను సెలవు ప్రకటించడం, గృహరుణాలపై వడ్డీ రాయితీ ప్రకటించడం వంటి కారణాలు కొత్త కొనుగోలుదారులను బాగా ప్రోత్సహించాయి. ఫలితంగా పలువురు ఇంటి కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో స్థిరాస్థి పరిశ్రమ క్రమంగా గాడినపడినట్టు నివేదిక అభిప్రాయపడింది. కోవిడ్ కారణంగా పలు ప్రాజెక్టుల అమ్మకాల్లో విపరీతమైన జాప్యం జరిగిందని, అది సదరు కాంట్రాక్టర్లకు ఇబ్బంది కలిగించిందని పేర్కొంది. అనంతరం కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోవడం ఈ సమస్య మరింత ఎక్కువైందని వివరించింది. అయితే, కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో పరిశ్రమ మళ్లీ పట్టాలెక్కడానికి దోహదం చేసినట్టయిందని పేర్కొంది. అయితే, కోవిడ్ సమయంలోనూ ఇళ్ల ధరల సూచీ తగ్గలేదని, మొదటివేవ్ సమయంలో ఇది 110 కంటే ఎక్కువ ఉండటమే ఇందుకు నిదర్శనమని వివరించింది. అదే సమయంలో క్వాంటిటీ ఇండెక్స్ మాత్రం 30 కంటే తక్కువకు పడిపోయిందని వెల్లడించింది. మరోవైపు పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం గృహరుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు కూడా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉండదని నివేదిక అభిప్రాయపడింది.

కోవిడ్ మహమ్మారి అనిశ్చితి కారణంగా పలువురు పెట్టుబడిదారులు ప్రాపర్టీ మార్కెట్ కు దూరంగా ఉన్నారని తెలిపింది. 2019లో దాదాపు రూ.1.59 లక్షల కోట్ల విలువైన విలాసవంతమైన గృహాలు అమ్ముడుపోలేదని, అత్యున్నత ఇళ్ల మార్కెట్ లో అమ్మకం కాని మొత్తం ఇళ్లలో ఇది 34 శాతమని పేర్కొంది. అలాగే కోవిడ్ మూడో వేవ్, డెల్టా వేరియంట్ కూడా స్థిరాస్థి రంగానికి కాస్త ఆందోళన కలిగిస్తోందని వెల్లడించింది. మహమ్మారి తర్వాత రియల్ పరిశ్రమ పలు మార్పులకు గురైందని పేర్కొంది. కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రం హోం విధానం కారణంగా వాణిజ్య స్థలాలకు డిమాండ్ తగ్గినా.. నివాస స్థలాల డిమాండ్ బాగా పెరిగిందని నివేదిక తెలిపింది.
ఏది ఏమైనప్పటికీ, భారత్ లో వ్యాపార కార్యకలాపాల పరిధిని దృష్టిలో పెట్టుకుని చూస్తే, వాణిజ్యపరమైన పెట్టుబడులు బాగా పెరిగే అవకాశం ఉందని నివేదిక అభిప్రాయపడింది. దేశంలో పని ప్రదేశాల అవసరంతోపాటు మరిన్ని కంపెనీలు ఏర్పడుతుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. అంతేకాకుండా 2051 నాటికి భారత పట్టణ ప్రాంతాల్లో నివసించే జనాభా 88 కోట్లకు చేరుతుందని, ఇది కూడా రియల్ పరిశ్రమకు ఊతమిచ్చే అంశమేనని వివరించింది. ప్రస్తుతం దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 46 కోట్ల మంది నివసిస్తున్నారని అంచనా. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత దాదాపు 58 శాతం మంది ప్రజలు ఆస్తినే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారనే విషయం కూడా ఈ నివేదిక వెల్లడించడం విశేషం.

This website uses cookies.