Categories: LEGAL

వేలానికి రవికిరణ్ రియాల్టీ ప్రాపర్టీలు

పెట్టుబడిదారులు సొమ్మును రికవరీ చేయడం కోసం రవికిరణ్ రియాల్టీ ఇండియా, ఆ సంస్థ ప్రమోటర్లకు చెందిన నాలుగు ఆస్తులను ఈనెల 16న వేలం వేయనున్నారు. ద్రవ్య మార్కెట్ల నియంత్రణ సంస్థ.. సెబీ ఈ ప్రక్రియ నిర్వహించనుంది. పశ్చిమ బెంగాల్ లో ఉన్న ఈ ప్రాపర్టీల రిజర్వు ధరను రూ.3.22 కోట్లుగా నిర్ధారించినట్టు తెలిపింది. ఆన్ లైన్ పద్ధతిలో జరిగే వేలానికి బిడ్లు ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించింది. వేలంలో ఉంచిన ఈ ఆస్తులకు సంబంధించిన అన్ని వివరాలను బిడ్డర్లు స్వయంగా తెలుసుకున్న తర్వాతే వేలంలో పాల్గొనాలని సెబీ సూచించింది.
పబ్లిక్ ఇష్యూ నిబంధనలకు విరుద్ధంగా ఈ కంపెనీ 1176 మందికి రిడీమ్ చేసుకోదగ్గ ప్రాధాన్యత షేర్లను (ఆర్ పీఎస్) జారీ చేసింది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల సొమ్మును తిరిగి ఇచ్చేయాలంటూ 2016 మార్చిలో రవికిరణ్ రియాల్టీ ఇండియాను సెబీ ఆదేశించింది. అయితే, కంపెనీ ఆ సొమ్ము తిరిగి ఇవ్వడంలో విఫలం కావడంతో సంస్థ ఆస్తులను వేలం వేసి తద్వారా వచ్చిన మొత్తాన్ని వారికి చెల్లించాలని సెబీ నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది నవంబర్ 5న వేలం వేయనున్నట్టు గతేడాది అక్టోబర్ లో ప్రకటించింది. అయితే, కొన్ని కారణాల వల్ల అది ఈనెల 16కి వాయిదా పడింది.

This website uses cookies.