Categories: LEGAL

హైకోర్టు తీర్పుతో అమరావతిలో రియల్ కళ

  • పలుచోట్ల భూముల ధరల్లో 40 నుంచి 100 శాతం పెరుగుదల

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి వీల్లేదని, నిర్దేశిత గడువులోగా అమరావతిలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అక్కడి రియల్ రంగంలో జోష్ వచ్చింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి పనులూ ప్రారంభించకపోయినప్పటికీ, పలు చోట్ల రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. చాలా ప్రాంతాల్లో భూముల ధరలు 40 శాతం నుంచి 100 శాతం మేర పెరగడమే ఇందుకు నిదర్శనం.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో అక్కడ రియల్ భూమ్ విపరీతంగా పెరిగింది. మునుపెన్నడూ లేనంత ఎక్కువగా కళ్లు చెదిరే ధరలకు భూములు అమ్ముడయ్యాయి. ఓ దశలో హైదరాబాద్ ను మించి రియల్ వ్యాపారం జరిగింది. అయితే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేయడంతో ఒక్కసారిగా అమరావతి రియల్ రంగం పాతాళానికి పడిపోయింది. అప్పటి నుంచి అక్కడ భూములను అమ్ముకునేవారే తప్ప కొనేవారే కరువయ్యారు.

డబ్బు అత్యవసరం అయినవారికి అయినకాడికి వాటిని అమ్ముకోగా.. కొందరు రిస్క్ చేసి వాటిని కొనుగోలు చేశారు. ఇలాంటి లావాదేవీలు తప్ప.. రియల్ లావాదేవీలు ఏమీ జరగలేదు. అయితే, తాజాగా అమరావతికి అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో రైతులు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం వచ్చింది. దీంతో క్రమంగా భూముల ధరలు పెరుగుతున్నాయి.

16వ నెంబర్ జాతీయ రహదారి కారణంగా వెంకటపాలెం, కిష్టయ్యపాలెం, మందడం గ్రామాల్లో డిమాండ్ బాగా ఉంది. అలాగే రాయపూడి, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడిల్లో కూడా రియల్ రంగం ఉపందుకుంది. ఇక్కడ 50 నుంచి 60 శాతం మేర భూముల ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. అయితే, 2018 ధరలతో పోలిస్తే మాత్రం ఇంకా 30 నుంచి 50 శాతం మేర తక్కువగానే ఉన్నాయి.

హైకోర్టు తీర్పు వెలువడక ముందు ఈ గ్రామాల్లో చదరపు గజం రూ.7వేల నుంచి రూ.10వేల మధ్య ఉండగా.. తీర్పు తర్వాత రూ.20 నుంచి రూ.22వేల మధ్య పలుకుతోందని శ్రీనివాసరవావు అనే రియల్టర్ తెలిపారు. ‘హైకోర్టు తీర్పు రైతులు, ఇన్వెస్టర్లలో మంచి విశ్వాసం తెచ్చింది. అయితే, కొందరు మాత్రం ఏపీసీఆర్డీఏ పనులు ప్రారంభించే వరకు వేచి చూస్తే బావుంటుందని ఆలోచిస్తున్నారు’ అని ఆయన వివరించారు. నేలపాడు, రాయపూడి, శాఖమూరు, వెలగపూడి గ్రామాల్లో డిమాండ్ బావుందని.. అక్కడ రూ.12 వేల నుంచి రూ. 18 వేల మధ్య ధర పలుకుతోందని చెప్పారు.

This website uses cookies.