Categories: LATEST UPDATES

రూ.830 లక్షల కోట్లు

ఇదీ మన రియల్ సత్తా.. 2047 నాటికి భారీ వృద్ధి

2021 చివరికి రూ.16.6లక్షల కోట్లు

క్రెడాయ్‌, కొలియర్స్‌ ఇండియా నివేదిక వెల్లడి

మనదేశ రియల్ మార్కెట్ భారీ బూమ్ తో పరుగులు పెట్టనుంది. 2021 చివరికి 0.2 ట్రిలియన్ డాలర్లు (దాదాపు రూ.16.6 లక్షల కోట్లు)గా ఉన్న మన స్థిరాస్తి రంగం.. 2047 నాటికి ఏకంగా 10 ట్రిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 830 లక్షల కోట్లు) చేరుతుందని క్రెడాయ్‌, కొలియర్స్‌ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ఇళ్లకు బలమైన డిమాండ్ కొనసాగుతుందని స్పష్టంచేసింది. 2021 నాటికి 0.2 ట్రిలియన్‌ డాలర్లతో భారత జీడీపీలో రియల్‌ ఎస్టేట్‌ రంగం వాటా 6-8 శాతం మధ్య ఉందని, ఇది 2031 నాటికి ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది. ఎంత తక్కువగా చూసినా 2047 నాటికి 3 నుంచి 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని.. కాస్త ఆశావహంగా చూస్తే 7-10 ట్రిలియన్‌ డాలర్లకు సైతం చేరుకునే అవకాశాలున్నాయని విశ్లేషించింది. అప్పటికి భారత జీడీపీలో రియల్‌ ఎస్టేట్‌ రంగం వాటా 14-20 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది.

ఆఫీసు రంగంతోపాటు రెసిడెన్షియల్, డేటా సెంటర్లు, సీనియర్ సిటిజన్స్ హోమ్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాల్లో బలమైన వృద్ధిని అంచనా వేస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా రియల్‌ ఎస్టేట్‌ వృద్ధి పెద్ద పట్టణాలను దాటి చిన్న పట్టణాలకూ చేరుకుంటుందని తెలిపింది. వేగవంతమైన పట్టణీకరణ, మధ్య వయసు జనాభా పెరుగుతుండడం, టెక్నాలజీ పరంగా పురోగతితో కొత్త తరం వృద్ధి, వైవిధ్య దశకంలోకి అడుగు పెట్టామని క్రెడాయ్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ బొమన్‌ ఇరానీ తెలిపారు. 2047 నాటికి భారత జనాభాలో 50 శాతం పట్టణాల్లోనే నివసించనున్నట్టు అంచనా వేశారు. దీంతో ఇళ్లు, కార్యాలయాలు, రిటైల్‌ వసతులకు ఊహించనంత డిమాండ్‌ ఏర్పడనున్నట్టు పేర్కొన్నారు. కాగా, దేశంలో ఇళ్లకు డిమాండ్‌ బలంగా కొనసాగుతోందని క్రెడాయ్ స్పష్టంచేసింది. ఏదైనా ఓ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు తగ్గడం అనేది కొత్త లాంచ్ లు తక్కువగా ఉండడం వల్లేనని పేర్కొంది.

This website uses cookies.