ఫిర్యాదుల పరిష్కారంలో రెరా గణనీయమైన పురోగతి సాధించింది. రెరా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా మొత్తం 1.16 లక్షల ఫిర్యాదులను పరిష్కరించింది. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి ఏడేళ్లలో 1.16 లక్షల ఫిర్యాదులను పరిష్కరించినట్టు వెల్లడించింది. మొత్తం పరిష్కారమైన ఫిర్యాదుల్లో 38 శాతంతో (44,602) ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా.. 20,604 ఫిర్యాదులతో హర్యాణా రెండో స్థానంలో, 15,423 ఫిర్యాదులను పరిష్కరించి మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచాయి. మొత్తమ్మీద 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ విధానాన్ని అమలు చేస్తుండగా.. లడఖ్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కింలు ఇంకా ఈ విధానం ప్రారంభించలేదు. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 1.16 లక్షల ప్రాజెక్టులు రెరాలో నమోదయ్యాయి. మహారాష్ట్ర అత్యధికంగా 36 శాతం ప్రాజెక్టులతో అగ్ర స్థానంలో ఉండగా.. తమిళనాడు (16%), తెలంగాణ (11%), గుజరాత్ (7%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.