- ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి
- రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలకు మినహాయింపు
ఆంధ్రప్రదేశ్ లో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్తగా ఖరారు చేసిన భూముల రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాజధాని అమరావతి పరిధిలోని పేదలను దృష్టిలో పెట్టుకుని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచడంలేదని వివరించారు. రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై ప్రజల అభ్యంతరాలు, సూచనలపై మదింపు చేస్తున్నాం. ప్రభుత్వ ధరల కంటే బహిరంగ మార్కెట్లో భూముల విలువలు ఎక్కువగా ఉన్నచోట రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయి.
చాలాచోట్ల బుక్ వాల్యూ కంటే బహిరంగ మార్కెట్లో పది రెట్లు ఎక్కువ విలువ ఉంది. అలాంటి గ్రోత్ సెంటర్లలో విలువలు పెరుగుతాయి. ప్రత్యేకించి ప్లాట్లు వేసిన చోట పెంపు ఉంటుంది’ అని వివరించారు. భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే చేస్తున్నట్టు చెప్పారు. సమస్యలన్నీ పరిష్కరించి ప్రజలకు భూ హక్కులు కల్పిస్తామని స్పష్టంచేశారు.