మణికొండ, పుప్పాలగూడ, నెక్నంపూర్ లోని అక్రమ భవనాలపై ఎన్జీటీ ఆదేశం
నగరంలోని మణికొండ, పుప్పాలగూడ, నెక్నంపూర్ లలో నాలాలపైనా, చెరువుల సమీపంలో అక్రమంగా నిర్మించిన భవనాలను వెంటనే కూల్చివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ఇలాంటి అక్రమ నిర్మాణాల కారణంగా వర్షాకాలంలో నీటిపారుదలకు ఇబ్బంది ఏర్పడి ఆయా ప్రాంతాలన్నీ నీట మనుగుతున్నందున వాటిని గుర్తించి కూల్చివేయాలని హెచ్ఎండీఏతోపాటు సీఎస్ సోమేశ్ కుమార్ కు సూచించింది. ఆయా ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల కారణంగా తలెత్తతున్న ఇబ్బందులపై మానవ హక్కులు, వినియోగదారుల పరిరక్షణ సెల్ ట్రస్ట్ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ కె.రామకృష్ణన్, డాక్టర్ సత్యగోపాల్ కొర్లపాటిలతో కూడిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం విచారిస్తోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాలని ఓ సంయుక్త కమిటినీ నియమించింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన కమిటీ.. తన నివేదికను ఎన్జీటీకి అందజేసింది. నాలాలపై అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో నివేదిక పరిశీలించిన ఎన్జీటీ.. వాటిని కూల్చివేయాలని ఆదేశాలిచ్చింది.