Categories: HOME LOANS

రెపో రేటు పెంపుతో రియల్ పై ప్రభావం?

వడ్డీ రేట్ల పెంపులో కీలక పాత్ర పోషించే రెపో రేటు పెంపులో రిజర్వు బ్యాంకు దూకుడుగానే ముందుకెళుతోంది. ఈ ఏడాది ఇప్పటికే మూడుసార్లు రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. తాజాగా మరోసారి 35 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో బ్యాంకులు ఇచ్చే అన్ని రకాల వడ్డీ రేట్లూ మరోసారి పెరగనున్నాయి. దీని ప్రభావం రియల్ రంగంపై ఎలా ఉంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

ఈ ఏడాది మేలో రెపో రేటు తొలిసారి పెరగడానికి ముందుకు ఆ వడ్డీ రేటు 4 శాతం వద్ద ఉండేది. కరోనా కల్లోలం నేపథ్యంలో ఇది ఇళ్ల అమ్మకాల పునరుద్ధరణకు దోహదపడింది. అనంతరం ప్రపంచవ్యాప్త పరిస్థితులు, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో ఆర్బీఐ ఇప్పటివరకు నాలుగు సార్లు రెపో రేటు పెంచింది. దీంతో ప్రస్తుతం అది 6.25 శాతానికి చేరింది. గత నాలుగేళ్లలో ఇది అత్యధికం. దీని ప్రభావంతో వడ్డీ రేట్లు పెరిగి రియల్ ఎస్టేట్ రంగం ప్రభావితం అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, వడ్డీ రేటు సింగిల్ డిజిట్ లో ఉన్నంత వరకు హౌసింగ్ పై ప్రభావం కొద్దిగానే ఉంటుందని.. ఒకవేళ సింగిల్ డిజిట్ దాటితే మాత్రం తీవ్ర ఒడుదొడుకులు తప్పవని అంటున్నారు. ముఖ్యంగా సరసమైన, మధ్యతరహా హౌసింగ్ విభాగాలపై దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. గృహ రుణాలపై వడ్డీ రేటు 9.5 శాతానికి కంటే తక్కువ ఉన్నంత వరకు ఇళ్ల అమ్మకాలపై ఓ మోస్తరు ప్రభావం మాత్రమే ఉంటుందని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పూరి అభిప్రాయపడ్డారు. ఈ పాయింట్ దాటితే మాత్రం సరసమైన, మధ్య శ్రేణి హౌసింగ్ విభాగాలలోని ఇళ్ల అమ్మకాలు ప్రభావితమవుతాయని పేర్కొన్నారు.

This website uses cookies.