Categories: LATEST UPDATES

నిర్మాణ లోపాలను పరిష్కరించండి..

  • ఎస్ కే కన్ స్ట్రక్షన్స్ కు రెరా స్పష్టీకరణ

అమ్మకం ఒప్పందంలో పేర్కొన్న మేరకు సౌకర్యాలు కల్పించాల్సిందేనని బీఆర్ మోహన్ రెడ్డికి చెందిన ఎస్ కే కన్ స్ట్రక్షన్స్ కు తెలంగాణ రెరా స్పష్టంచేసింది. నిర్మాణపరమైన లోపాలను పరిష్కరించడంతోపాటు మంజీరా వాటర్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఎస్ కే కన్ స్ట్రక్షన్స్ సంస్థ గాజులరామారంలో పద్మశ్రీకార్ ఐకాన్ అనే రెసిడెన్షియల్ ప్రాజెక్టు చేపట్టింది. అయితే, ప్లే ఏరియా, జిమ్, మల్టీ పర్పస్ హాల్ వంటి సౌకర్యాల కోసం తమ దగ్గర రూ.3 లక్షల చొప్పున వసూలు చేసినా.. వాటిని ఏర్పాటు చేయలేదని పేర్కొంటూ బి.ఎం.వంశీకృష్ణ, రచ్చ నవీన్ కుమార్, ఇతర ఫ్లాట్ యజమానులు రెరాలో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా మంజీరా వాటర్ కనెక్షన్ కోసం రూ. 10 వేలు తీసుకున్నారని.. అది కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు.

అయితే, తాను ఒప్పందం, బ్రౌచర్లో పేర్కొన్న మేరకు అన్ని సౌకర్యాలూ కల్పించానని.. జిమ్, ప్లే ఏరియా, మల్టీ పర్పస్ హాల్ సాంక్షన్డ్ ప్లాన్ లో లేవని, కానీ తాను వాటిని నివాసితుల కోరిక మేరకు తర్వాత నిర్మించానని బిల్డర్ వాదించారు. వాటర్ కనెక్షన్ ఎవరికి వారు నివాసితులే ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. వాదనలు విన్న రెరా.. ప్రాజెక్టు సాంకేతిక తనిఖీకి ఆదేశించింది. ఈ సందర్భంగా వాటర్ లీకేజీ, గోడల్లో పగుళ్లు, డ్రైనేజీ సరిగా లేకపోవడం వంటి పలు నిర్మాణ లోపాలను గుర్తించింది. దీంతో వాటన్నింటినీ పరిష్కరించడంతోపాటు వాటర్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని బిల్డర్ ను ఆదేశించింది. ఇక సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని బిల్డర్ ప్రకటనల్లో పేర్కొన్నప్పటికీ, అవి ఒప్పందం, సాంక్షన్డ్ ప్లాన్ లో లేనందున వాటిని క్లెయిమ్ చేసుకునే హక్కు నివాసితులకు లేదని రెరా స్పష్టం చేసింది.

This website uses cookies.