Categories: LATEST UPDATES

300కి పెరిగిన ఫ్యామిలీ ఆఫీసులు

దేశంలో ఫ్యామిలీ ఆఫీసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2018లో దేశవ్యాప్తంలో 45 ఫ్యామిలీ ఆఫీసులు ఉండగా.. ప్రస్తుతం అవి 300కి పెరిగాయి. టైర్-2, టైర్-3 నగరాల్లో వ్యాపారాలను ప్రమోటర్లు పటిష్టంగా నిర్మించుకుంటున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింతగా పెరగనుందని పీడబ్ల్యూసీ నివేదిక వెల్లడించింది. భారత్ అధిక వృద్ధి బాటలో ముందుకు సాగడంలో ఫ్యామిలీ వ్యాపారాల తోడ్పాటు చాలానే ఉందని తెలిపింది.

తయారీ, రిటైల్, రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్, ఫైనాన్స్ తదితర రంగాలవ్యాప్తంగా బడా సంస్థలతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలు కూడా వీటిలో ఉన్నాయని వివరించింది. ఫ్యామిలీ ఆఫీసులు సంపద పరిరక్షణకు మాత్రమే పరిమితం కాకుండా అర్ధవంతమైన, బాధ్యతాయుతమైన పెట్టుబడులకు దోహదపడే అధునాతన సంస్థలుగా ఎదిగాయని నివేదిక పేర్కొంది. ఫ్యామిలీ ఆఫీసుల ప్రభావం పెరుగుతుండటం దేశీయంగా మారుతున్న వెల్త్ మేనేజ్‌మెంట్ తీరుతెన్నులను ప్రతిబింబిస్తోందని పీడబ్ల్యూసీ ఇండియా భాగస్వామి ఫల్గుణి షా తెలిపారు.

ఎవరైనా సరే రూ.1000 కోట్లకు పైగా లిక్విడ్ ఫైనాన్షియల్ వెల్త్ కలిగి ఉంటే.. వారు సొంతంగా తమ ఫ్యామిలీ ఆఫీస్ ఏర్పాటు చేయొచ్చు. అత్యంత సంపన్నులు, వ్యాపార కుటుంబాలకు ఉండే విశిష్ట అవసరాలకు అనుగుణంగా ఫ్యామిలీ ఆఫీసులు ప్రత్యేక సర్వీసులను అందిస్తున్నాయి. వ్యూహాత్మకంగా రిస్కులను తగ్గించే సాధనాలపై దృష్టి పెడుతున్నాయి. వర్ధమాన మార్కెట్లలో అవకాశాలను అన్వేషిస్తున్నాయి. టెక్నాలజీ, అంతర్జాతీయంగా డైవర్సిఫికేషన్, ఈఎస్‌జీ (పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్) సూత్రాలతో ఫ్యామిలీ ఆఫీసులు దేశీయంగా సంపద నిర్వహణ స్వరూపాన్ని మారుస్తున్నాయి.

This website uses cookies.