ఆర్ఎన్ఏ పలాజ్జో ప్రాజెక్టు కొనుగోలుదారులకు బాంబే హైకోర్టు ఊరట కల్పించింది. నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును కొనుగోలుదారులు స్వయంగా అభివృద్ధి చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇందుకోసం ఫ్లాట్ కొనుగోలుదారుల అసోసియేషన్ ను కోర్టు రిసీవర్ ఏజెంట్ గా నియమించి, ఆ ప్రాజెక్టును స్వయంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించింది. ఈ నిర్ణయంతో 78 మంది ఫ్లాట్ కొనుగోలుదారులకు భారీ ఉపశమనం కలిగింది.
ముంబై కండివ్లిలోని ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత కొందరు ఫ్లాట్లు కొనుగోలు చేశారు. అయితే, 2012 నుంచి ఇందులో నిర్మాణ కార్యకలాపాలు సరిగా సాగడం లేదు. దీంతో 75 మంది ఫ్లాట్ కొనుగోలుదారులు అసోసియేషన్ గా ఏర్పడి 2018లో బిల్డర్ పై హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం కోర్టు రిసీవర్ ను నియమించి, దానితో ప్రాజెక్టును పూర్తి చేయించాలని నిర్ణయించింది. ఇందుకు బిల్డర్ కూడా అంగీకరించడంతో అసోసియేషన్ ను కోర్టు రిసీవర్ గా నియమించింది. దీనికి సర్వ హక్కులూ అప్పగించింది. అమ్ముడుపోని ఫ్లాట్ల అమ్మకం, బదిలీ, ఇతరత్రా వ్యవహారాలను పరిష్కరించడం, చెల్లింపులు స్వీకరించడం, చేయడం వంటి పనులతోపాటు ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత అసోసియేషన్ కు అప్పగించింది. కాగా, ఇంకా మిగిలి ఉన్న 27 అంతస్తులను పూర్తి చేయడానికి రూ.40 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు.
This website uses cookies.