Categories: LEGAL

సానుభూతికి అర్హులు కారు

  • ఆమ్రపాలి వ్యవస్థాపకుడు అనిల్ కుమార్ కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ
  • బెయిల్ పిటిషన్ కొట్టివేత

వేలాది మంది ఇళ్ల కొనుగోలుదారులను మోసం చేసిన నేపథ్యంలో ఎలాంటి సానుభూతికీ అర్హులు కారని ఆమ్రపాలి వ్యవస్థపాకుడు, మాజీ చైర్మన్ అనిల్ కుమార్ శర్మకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘మీరు వేలాది మంది ఇళ్ల కొనుగోలుదారులను మోసం చేశారు.

వారి కష్టార్జితాన్ని దుర్వినియోగం చేశారు. సానుభూతి పొందడానికి మీకు ఎలాంటి అర్హతా లేదు’ అని వ్యాఖ్యానించింది. ఆయన చేసింది చిన్న మోసం కాదని, దాని వల్ల వేలాది మంది ఎలా ప్రభావితమయ్యారో చూడాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో సానుభూతి పొందే అర్హత ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. దాని కంటే జైలులో ఉండటమే మంచిదని వ్యాఖ్యానించింది. ఆయన చేసిన మోసం ఏమిటనేది ఈ కోర్టుకు బాగా తెలుసని, ఈ వ్యవహారంతో ఎంతోమంది తీవ్రంగా ప్రభావితమయ్యారని, వారిని దాని నుంచి ఎలా బయటకు తీసుకురావాలో కూడా తెలియడంలేదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

శర్మ నాలుగున్నరేళ్లకు పైగా జైలులో ఉన్నారని, ఆయనకు బెయిల్ ఇస్తే కంపెనీ పునరుద్ధరణకు మంచిదని శర్మతరపు న్యాయవాది నివేదించారు. అయితే, దీంతో న్యాయస్థానం విభేదించింది. సానుభూతికి కూడా ఆయనకు అర్హత లేదని పేర్కొంటూ బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. కాగా, ఆమ్రపాలికి చెందిన 16 ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత ఎన్ బీసీసీకి సుప్రీంకోర్టు అప్పగించింది. వీటిని పూర్తి చేయడానికి దాదాపు రూ.8వేల కోట్లు అవసరమని అంచనా వేశారు.

This website uses cookies.