స్థలం కొని ఇల్లు కట్టాలంటే మామూలు విషయం కాదు. ఎక్కడ చూసినా ఇళ్ల స్థలాల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. కనీసం 60 లేదా 70 గజాల్లో ఇల్లు కట్టుకోవాలన్నా.. స్థలానికే లక్షలు పోయాల్సిందే. అలాంటిది రూ.800కే 120 గజాల స్థలం వస్తుందంటే నమ్మగలమా? కానీ ఇది నిజం. చదరపు మీటరు స్థలాన్ని కేవలం రూ.8కే అమ్ముతున్నారు. ఎక్కడో చెబితే వెళ్లి ఒక ఎకరమో, రెండెకరాలో కొనేస్తామంటారా? స్వీడన్ లో అమ్ముతున్నారు.
స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ కు 321 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోటెన్ అనే నగరంలో ఇలా చదరపు మీటరు స్థలాన్ని రూ.8కే విక్రయిస్తున్నారు. స్వీడన్‌లోని రూరల్ ప్రాంతమైన గోటెన్ సిటీలో దాదాపు 13 వేల మంది నివసిస్తుంటారు. ఇటీవల అక్కడ జనాభా తగ్గిపోయింది. అంతేకాకుండా ఆ నగరానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఇళ్లకు డిమాండ్ పెంచడం కోసం అధికారులు అతి తక్కువ ధరకే ఇళ్ల స్థలాలను అమ్మకానికి పెట్టారు. ఒక చదరపు మీటరుకు ఒక క్రోనా (దాదాపు రూ.7.86) ధర నిర్ధారించారు. అలా అని ఎకరాలకు ఎకరాలేమీ అమ్మడంలేదండోయ్. కేవలం 29 ప్లాట్లను మాత్రమే ఈ రేటుతో అమ్మనున్నారు.
This website uses cookies.