Categories: LATEST UPDATES

ఈడీ విచారణకు సాహితీ లక్ష్మీనారాయణ డుమ్మా?

సాహితీ ఇన్ ఫ్రా కుంభకోణంలో ప్రధాన నిందితుడు బి.లక్ష్మీనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు డుమ్మా కొడుతున్నారు. ఇప్పటికే మూడు సార్లు ఈడీ విచారణకు అందుబాటులో లేకుండా తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తుకు సహకరించేలా నిందితులను ఆదేశించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ఈడీ నిర్ణయించింది. హైరైజ్ అపార్ట్ మెంట్ ప్రీలాంచ్ పేరుతో దాదాపు 2500 మందిని రూ.900 కోట్ల మేర మోసం చేశారు. ఇందులో అమీన్ పూర్ సాహితీ శ్రావణి ఎలైట్ వెంచర్ లో 1700 మంది కొనుగోలుదారుల నుంచి రూ.539 కోట్లు వసూలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణానికి సంబంధించి పోలీసులు 46 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. గతేడాది డిసెంబర్ లో సాహితీ ఇన్ ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో మనీ ల్యాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. లక్ష్మీనారాయణ, ఆయన కుటుంబ సభ్యులను విచారించడానికి వారి ఇల్లు, కార్యాలయాలకు ఈడీ అధికారులు వెళ్లినప్పటికీ ఎవరూ అందుబాటులో లేరు. ఇలా మూడు సార్లు జరగడంతో కోర్టుకు వెళ్లాలని ఈడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

This website uses cookies.