Categories: EXCLUSIVE INTERVIEWS

నాలుగు రోజుల్లోనే గృహ‌రుణం

  • ఎస్‌బీఐ డీజీఎం
    ర‌వీంద్ర ఎన్ హిత్‌న‌ల్లీ

ప‌త్రాల‌న్నీ స‌క్ర‌మంగా ఉంటే.. కేవ‌లం నాలుగు రోజుల్లోనే గృహ‌రుణాన్ని మంజూరు చేస్తామ‌ని ఎస్‌బీఐ హైద‌రాబాద్ రీజియ‌న్ డీజీఎం ర‌వీంద్ర డి హిత్‌న‌ల్లీ తెలిపారు. గృహ‌రుణాలతో పాటు బిల్డ‌ర్ల‌కు ప్రాజెక్టు ఫైనాన్స్‌ను అందించ‌డంలో ఎల్ల‌ప్పుడూ ముందంజ‌లో ఉంటామ‌న్నారు. హైద‌రాబాద్ కోఠిలోని ఎల్‌హెచ్‌వో కార్యాల‌యంలో ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ గురుతో ప్ర‌త్యేకంగా మాట్లాడుతూ.. హైద‌రాబాద్‌లో నెల‌కు సుమారు ఆరు వేల కోట్ల రూపాయ‌ల మేర‌కు రియ‌ల్ లావాదేవీలు జ‌రిగితే.. అందులో ముప్ప‌య్ శాతం వాటా ఎస్‌బీఐదేన‌ని తెలిపారు.

ఎస్‌బీఐ నెల‌కు సుమారు మూడు వేల కోట్ల రూపాయ‌ల దాకా హౌసింగ్ లోన్‌, బిల్డ‌ర్ ఫైనాన్స్ వంటివి అంద‌జేస్తోంద‌న్నారు. గ‌త మూడు నుంచి నాలుగేళ్ల‌లో నెల‌కు వెయ్యి నుంచి ప‌దిహేను వంద‌ల కోట్ల రుణాల్ని మంజూరు చేశామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం నెల‌కు ఆరు వంద‌ల కోట్ల‌కు అద‌నంగా గృహరుణాల్ని ఇస్తూ.. మూడు వేల ఆరు వంద‌ల కోట్ల రూపాయ‌ల్ని మంజూరు చేశామ‌న్నారు. మార్కెట్లో కాస్త పేరున్న బిల్డ‌ర్లు నిర్మిస్తున్న ప్రాజెక్టుల‌కు ఫండింగ్ కూడా చేస్తున్నామ‌ని తెలిపారు. ఇంకా ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే..

మా బ్యాంకు త‌ర‌ఫున‌ రియ‌ల్ ఎస్టేట్ రంగానికి రెండు ర‌కాలుగా ఆర్థిక సేవ‌ల్ని అందిస్తున్నాం. సర్కిల్ కార్యాలయాల్లో సీసీఆర్‌జీ ద్వారా రూ. 150 కోట్ల వరకు ప్రాజెక్ట్ ఫైనాన్స్ చేస్తాం. మా కార్యాలయం ద్వారా పెద్ద ప్రాజెక్టుల‌కు అధిక మొత్తంలో ఫండింగ్ ఇస్తాం. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో సుమారు ఇర‌వై రెండు ప్రాజెక్టుల‌కు రూ.458 కోట్ల రూపాయ‌ల్ని ఫండింగ్ చేశాం. మొత్తానికి ప‌దిహేను వంద‌ల కోట్ల దాకా బిల్డ‌ర్ల‌కు ఫైనాన్స్ ఇవ్వాల‌న్న ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్నాం.

అంత‌కు ముందు వ‌ర‌కూ కేవ‌లం గృహ‌రుణాల్ని మాత్రమే మంజూరు చేసేవాళ్లం. కాక‌పోతే నిర్మాణ రంగంలో పెరిగే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. బిల్డ‌ర్ల‌కు ఫైనాన్స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఇళ్ల‌కు డిమాండ్ అనేది ఎవ‌ర్‌గ్రీన్ గా ఉంటుంది. కాక‌పోతే, హైద‌రాబాద్‌లో ఇది అనూహ్యంగా అభివృద్ధి చెందుతోంది, ఈ క్ర‌మంలో బిల్డ‌ర్ల‌కు ఫైనాన్స్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా సుమారు ఐదు వంద‌ల నిర్మాణ సంస్థ‌ల‌తో పొత్తు పెట్టుకున్నాం. ఇందులో దాదాపు నాలుగు వంద‌ల కంపెనీలు కేవ‌లం హైద‌రాబాద్‌లోనే ఉన్నాయి.

గృహ‌రుణాలు, బిల్డ‌ర్ల‌కు రుణానికి సంబంధించిన ద‌ర‌ఖాస్తుదారుల‌కు సంబంధించిన లీగ‌ల్ అంశాలు, డాక్యుమెంటేష‌న్ ప‌ట్ల ఆల‌స్యాన్ని త‌గ్గించేందుకు ప్ర‌త్యేకంగా న్యాయ‌వాదుల విభాగం, ప్రాజెక్టు అనుమ‌తుల‌కు సంబంధించి విడిగా ఇంజినీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఈ విభాగం ఇళ్ల కొనుగోలుదారుల‌కైనా డెవ‌ల‌ప‌ర్ల‌కు అయినా.. వారే స్వ‌యంగా రంగంలోకి దిగి.. నిపుణుల స‌ల‌హాల‌ను తీసుకుని రుణమంజూరు విష‌యంలో.. ముందుకెళ్ల‌డానికి కానీ తిర‌స్క‌రించ‌డానికి కానీ రిక‌మండ్ చేస్తారు. వివ‌రాల‌న్నీ స‌క్ర‌మంగా ఉంటే.. గృహ‌రుణాన్ని నాలుగు రోజుల్లోనే మంజూరు చేస్తాం. హైదరాబాద్లో 10 ప్రాసెసింగ్ సెంటర్లు, తెలంగాణవ్యాప్తంగా 26 ప్రాసెసింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశాం.

ఈ ప్రాజెక్టుల‌కే ఫండింగ్‌!

రెరా అనుమతులున్న బిల్డర్స్ ప్రాజెక్టులకే ఫండింగ్ చేస్తోంది. బిల్డర్లు నిర్మాణ రంగంలో ఐదు ప్రాజెక్టులు నిర్మించిన అనుభవం ఉండాలి. కనీసం నాలుగు విజయవంతమైన ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలి. వారు ఎస్బీఐ ఇచ్చే ఫండుకు తగ్గ కొలాట్ర‌ల్ సెక్యూరిటీ కి ఒప్పుకుని ఉండాలి. ప్రస్తుత సందర్భాల్లో మెజారిటీ వర్గాలు జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ విధానంలో ల్యాండ్ లార్డ్స్ ప్రాపర్టీ మార్టిగేజ్ కోసం ముందుకు రాని సందర్భంలో బిల్డర్లు నూట ఇరవై ఐదు శాతం విలువ‌ను సెక్యూరిటి వాల్యూగా బ్యాంకుకి చూపించాలి.

ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు నాలుగు వందల ఎనభై కోట్లతో 24 కొత్త ప్రాజెక్టులకు ఫండింగ్ చేశాం. గత నెలన్నరలో ఎస్బీఐ ఫండింగ్ కోసం ఐదు వందల కోట్ల బడ్జెట్ అవసరమయ్యే దరఖాస్తులు వచ్చాయి. ఆ ప్రాజెక్టుల‌కు త్వరలో రుణాన్ని మంజూరు చేస్తాం. మొత్తానికి, ఈ ఏడాది రూ.1500 కోట్లు ఫండింగ్ చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాం. అనుమ‌తుల‌న్నీ ప‌క్క‌గా ఉన్న ప్రాజెక్టుల్లోనే ఫ్లాట్ల‌ను కొనుగోలు చేయాలి. ఎస్‌బీఐ అప్రూవ‌ల్ ఉంటే నిర‌భ్యంత‌రంగా కొనుక్కోవ‌చ్చు. రుణం తీసుకోవాల‌ని భావించేవారు ఎక్క‌డికి తిర‌గ‌క్క‌ర్లేదు. మా నుంచి రుణం పొంద‌డ‌మెంతో సులువు. రెరా అనుమ‌తులున్న ప్రాజెక్టు అయితే సులువుగా రుణం ల‌భిస్తుంది.

రుణం సులువే ఇక‌!

ఇంటి కొనుగోలుదారులు అనుమ‌తుల‌న్నీ ప‌క్క‌గా వ‌చ్చిన ప్రాజెక్టుల్లోనే ఫ్లాట్ల‌ను కొనుగోలు చేయాలి. మా అప్రూవ‌ల్ ఉన్న ప్రాజెక్టులో నిర‌భ్యంత‌రంగా కొనుక్కోవ‌చ్చ‌ని గుర్తుంచుకోండి. ఇందుకోసం ఎక్క‌డికి తిర‌గ‌క్క‌ర్లేదు. మా బ్యాంక్ ప్రాసెసింగ్ సెంట‌ర్ల‌కు వెళ్లి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే.. మా ప్యానెల్ అడ్వ‌కేట్లు, ఇంజినీర్లు అన్నీ చూసుకుంటారు. వారు ఒక‌సారి మాకు ప్ర‌తిపాద‌న‌లు పంపిస్తే నాలుగు రోజుల్లోనే రుణం మంజూరు అవుతుంది. కొనుగోలుదారుల‌కు మా హోమ్ లోన్ సోర్సింగ్ టీమ్‌, ఇన్ హౌస్ టీమ్‌, ఎస్‌బీఐ కాప్ వ్య‌వ‌స్థ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. 300 మంది హోమ్ కౌన్సిల‌ర్లు క‌స్ట‌మ‌ర్ల కోసం నిత్యం ప‌ని చేస్తుంటారు. రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారిలో చాలా త‌క్కువ శాతం మందికి తిర‌స్క‌రించాం. న‌మ్మ‌కం, స్థోమ‌త ఉన్న‌వారే మా వ‌ద్ద‌కు రుణం కోసం విచ్చేస్తార‌ని గుర్తుంచుకోవాలి.

2023- 2024 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 7500 కోట్లను ఫండింగ్ చేయాల‌న్న ల‌క్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అన్నీ క‌లిపి.. ఇప్పటికే 6 నెలల్లో రూ. 3500 కోట్లు రుణ‌మిచ్చాం. హోమ్ బయర్లు, బిల్డర్ల‌ ఫైనాన్స్ కోసం, డిమాండును బ‌ట్టి అవ‌స‌ర‌మైతే రూ.8000 కోట్ల‌ను మంజూరు చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాం.

ఎవ‌రికేం చూస్తారు?

నెల‌వారి జీతం, తిరిగి చెల్లించే సామ‌ర్థ్యం బ‌ట్టి రుణాన్ని మంజూరు చేస్తాం. కోటి రూపాయ‌ల విలువ గ‌ల ఆస్తి మీద 80 శాతం, కోటీ క‌న్నా ఎక్కువ విలువ గ‌ల ఇంటిపై 75 శాతం రుణమిస్తాం. హోమ్ లోన్ల విషయంలో మూడు అంశాల్ని ప‌రిశీలిస్తాం. ఉద్యోగులైతే ఫార్మ్‌ 16, రెండేళ్ల టాక్స్ రిటర్న్స్ చూస్తాం. బిజినెస్ క్లాస్ అయితే మూడేళ్ల ఐటీ రిటర్న్స్, కే వైసీ వివరాల్ని చూస్తాం. ప్రొఫెషనల్స్‌కూ హోమ్ లోన్ విషయంలో ఇదే వర్తిస్తుంది. అయితే వారు ఏ ప్రాజెక్టులో కొంటున్నా.. ఆయా ప్రాజెక్టు వాల్యుయేషన్, లీగల్ ఒపీనియన్ కచ్చితంగా పరిగణలోకి తీసుకొంటాం.

ఇదే హైద‌రాబాద్ ప్ర‌త్యేక‌త‌!

హైదరాబాద్లో బిల్డర్లు డెలివ‌రీ సమయంలో కొంత జాప్యం ఏర్పడుతున్నప్ప‌టికీ.. చివరికి కస్టమర్లు కోరుకున్న విధంగా అందజేస్తున్నారు. ఆలస్యం ఎక్కడో ఒక చోట అనుకోకుండా జరుగుతుంది. బిల్డర్లు పోటా పోటీగా కస్టమర్లకు సదుపాయాలు కల్పించడంలో వెనుకడుగు వేయ‌ట్లేదు. నిర్మాణం మధ్యలో వ్య‌యం పెరుగుతున్నా పట్టించుకోవడం లేదు. అపార్టుమెంట్ల డెలివ‌రీ విష‌యంలో వేరే రాష్ట్రాల్లో కొంత కాల‌యాప‌న జ‌రుగుతున్న మాట వాస్త‌వ‌మే. వివిధ నగరాల్లో కొన్ని మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టులున్నాయి. కానీ, హైదరాబాద్‌లో అలాంటి ప‌రిస్థితి లేదు. ఇక్క‌డ మౌలిక స‌దుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయి. రియ‌ల్ రంగానికి ప్ర‌భుత్వం చ‌క్క‌టి మ‌ద్ధతును అందజేస్తోంది.

This website uses cookies.