కరోనా తర్వాత ప్రజల జీవన విధానంతోపాటు అభిరుచులు, అలవాట్లలోనూ చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు నగరంలోనే జీవించాలనుకునేవారంతా ఇప్పుడు ఈ రణగొణధ్వనులు, కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో, ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకుంటున్నారు. ఉద్యోగం, వ్యాపారరీత్యా నగరంలోనూ ఉంటున్నప్పటికీ, వారాంతాలు, సెలవుల్లో అలాంటి వాతావరణంలో ఉండేందుకు రెండో ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా మిలీనియల్స్ ఈ విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఫలితంగా రియల్ ఎస్టేట్ బిల్డర్లు సైతం వారి ఆశలు, ఆంకాంక్షలకు తగినట్టుగా ప్రాజెక్టులు చేపడుతున్నారు.
ఒక విధంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ ముఖచిత్రాన్ని మిలీనియల్స్ మార్చేశారు. ఒక ఇంటికి పరిమితం కాకుండా పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో రెండో ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రియల్టర్లు అలాంటి ప్రదేశాల్లో వెంచర్లు, ప్రాజెక్టులు చేపడుతున్నారు.
వర్క్ ఫ్రం హోం చేసే టెకీలు చాలామంది ఎంత దూరంలోనైనా సరే రెండో ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. తాము నివసించే నగరంలో ఉన్న ఇంటితోపాటు తమకు ఇష్టమైన పర్యాటక ప్రాంతాల్లో రెండో ఇంటిని కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా గోవా, మనాలి, సిమ్లా, రత్నగిరి, కసౌలి, కూనూరు, మున్నార్, కూర్గ్, ఊటీ, గోకర్ణం వంటి ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. వర్క్ ఫ్రం హోమ్ చేసేవారు అక్కడ ఉంటూ వారాంతాల్లో సమీప ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుండగా.. వర్క్ ఫ్రం హోమం ఆప్షన్ లేనివారు వారాంతాలు, సెలవు రోజుల్లో రెండో ఇంటికి వెళ్లి సేద తీరుతున్నారు. ఈ క్రమంలో రియల్టర్లు సైతం మిలీనియల్స్ ఆకాంక్షలకు తగినట్టుగా ప్రాజెక్టులు చేపడుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో నివాస, వాణిజ్యపరంగా ఉండేలా నిర్మాణాలను తీర్చిదిద్దుతున్నారు. అంటే..
ఇంటిని కొన్నవారు తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి అక్కడ ఉండేందుకు.. తాము లేని సమయంలోవాటిని అద్దెకు ఇచ్చే విధంగా నిర్మిస్తున్నారు. అలాగే రిసార్టులను నిర్మించి ఆయా నిర్మాణాల్లో కొంత భాగాన్ని చదరపు అడుగుల లెక్కన విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు అక్కడ నివసించని సమయాల్లో వాటిని అద్దెకు ఇచ్చి అందులో తగిన వాటాను చెల్లిస్తున్నారు. విల్లాలను సైతం నాలుగు భాగాలుగా చేసి తక్కువ బడ్జెట్ లో కొనుగోలుచేసేవారికి విక్రయిస్తున్నారు.
ఒకప్పుడు రిటైర్ అయ్యాక సొంతూరికి వెళ్లి స్థిరపడదామనే ఆలోచనలో ఉండేవారు. కానీ ఇప్పుడు వెకేషన్ కమ్ రిటైర్మెంట్ ప్లాన్.. రెండూ ఒకటే అయిపోయాయి. తమకు ఇష్టమైన ప్రదేశంలో రెండో ఇల్లు కొనుక్కుని వెకేషన్ హోమ్ గా వినియోగించుకోవడంతోపాటు రిటైర్ అయ్యాక అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆర్గానిక్ సాగు చేస్తూ.. ప్రశాంతమైన జీవనం గడిపేలా ముందుగానే ప్రణాళికలు వేసుకుంటున్నారు. 28 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు రెండో ఇంటి కోసం ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని జేఎల్ఎల్ ఇండియా సీనియర్ డైరెక్టర్ రితేశ్ మెహతా చెప్పారు.
వాటిపై రిటర్నులు కూడా బాగుండటమే ఇందుకు ఓ కారణమని విశ్లేషించారు. రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల లోపు పెట్టుబడి పెడితే సరిపోతుందని.. బడ్జెట్ ఉన్నవారు అంతకుమించి కూడా పెట్టే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో నివసిస్తున్న పలువురు టెకీలు, వ్యాపారవేత్తలు గోవా, హంపి, రుషికేష్, గోకర్ణం తదితర ప్రాంతాల్లో రెండో ఇంటిని కొనుగోలు చేస్తున్నారు.
This website uses cookies.