అక్కడి మార్కెట్ పెరుగుదలే ప్రధాన కారణం
సినీనటులు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం సహజం. ఎక్కడ తమ పెట్టుబడులు వేగంగా పెరుగుతాయో అక్కడ ప్రాపర్టీలు కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో దక్షిణ భారతదేశానికి చెందిన నటీనటులు, నిర్మాతలు ముంబై వైపు చూస్తున్నారు. అక్కడి మార్కెట్ ధరల పెరుగుదలే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. దక్షిణ భారత నటీనటులు, సినిమాలు దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందడంతో దేశం చూపు ఇటువైపు పడింది. ముఖ్యంగా బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, పొన్నియన్ సెల్వన్, కల్కి 2898 ఏడీ, కాంతారా వంటి విజయాలతో దక్షిణ భారత సినీ నటులు, దర్శకులు, నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టే ట్రెండ్ పెరుగుతోంది.
ఇదే సమయంలో వీరంతా ముంబైలో ఆస్తులు కొనుగోలు చేసే ఒరవడి కూడా పెరిగింది. సినిమా షూటింగులు, ఇతరత్రా పనుల నిమితం సినిమా ప్రముఖులు ముంబైలో అధిక సమయం ఉంటారు. దీంతో హోటళ్లలో ఉండటం కంటే ప్రాపర్టీ కొనుగోలుకు మొగ్గు చూపిస్తున్నారు. అంతేకాకుండా ముంబై ప్రాపర్టీ మార్కెట్ ధరల పెరుగుదలతోపాటు ప్రాపర్టీని లిక్విడేట్ చేసే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో ముంబైలో ప్రాపర్టీలు కొనుగోలుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.
తమిళ చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా యాజమాన్యంలోని స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంవత్సరం ముంబైలోని అంధేరీ వెస్ట్ సబర్బన్ లో 3,414 చదరపు అడుగుల అపార్ట్ మెంట్ ను రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. ఒప్పందంలో మూడు కారు పార్కింగ్ స్థలాలు కూడా వచ్చాయి. అలాగే మలయాళ నటుడు, చిత్ర నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రొడక్షన్ హౌస్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ లిమిటెడ్.. ముంబైలోని పాష్ పాలి హిల్ ప్రాంతంలో రూ.30.6 కోట్లకు డ్యూప్లెక్స్ కొనుగోలు చేసింది. బాంద్రాలోని పాలి హిల్‌లో నరైన్ టెర్రస్ అనే భవనంలో 2,970 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రాపర్టీ ఉంది. దీనికి నాలుగు కార్ పార్కింగ్ స్థలాలు వచ్చాయి. ఈ రిజిస్ట్రేషన్ కోసం రూ.1.84 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ. 30వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు.
పాలి హిల్ అనేది చాలా మంది బాలీవుడ్ తారలు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు ఇళ్లను కొనుగోలు చేయడానికి ఓ ప్రీమియం చిరునామా. ఇక్కడ చదరపు అడుగు ధర రూ. లక్ష పైనే పలుకుతోంది. కంగువ చిత్రంలో నటించిన సూర్య వ్యక్తిగత కారణాల వల్ల ముంబై వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. మ్యాడీగా ప్రసిద్ధి చెందిన నటుడు ఆర్. మాధవన్ కూడా ముంబైలోని కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ప్రాపర్టీ కొనుగోలు చేశారు. 4,182 చదరపు అడుగుల అపార్ట్ మెంట్ ను రూ. 17.5 కోట్లకు కొనుగోలు చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో నివసిస్తున్న సమంతా రూత్ ప్రభు గతేడాది ముంబైలో రూ.15 కోట్ల విలువైన 3బీహెచ్ కే ప్రాపర్టీ కొనుగోలు చేశారు. రష్మిక మందన్న కూడా గతేడాది ముంబైలో ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు.
దక్షిణ భారతదేశానికి చెందిన చాలా మంది నటీనటులు, దర్శకులు తమ ప్రాపర్టీ పోర్టుఫోలియోను విస్తరించేందుకు ముంబైలో మరో ఇంటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇతర మార్కెట్లతో పోలిస్తే.. ఇక్కడ విలువ వేగంగా పెరుగుతుందని వివరించారు. అలాగే ప్రస్తుతం దక్షిణ భారతదేశ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా మారాయి.
దీంతో ఆయా సినిమాల నటీనటులు, నిర్మాతలు, దర్శకులు పలు షూటింగ్స్, సమావేశాల కోసం తరచుగా ముంబై వెళ్లి రావాల్సి ఉంటుంది. దీంతో అక్కడ హోటల్ లో ఉండటం లేదా అద్దెకు ఇల్లు తీసుకోవడం కంటే ఓ ప్రాపర్టీ కొనుగోలు చేయడమే మంచిదనే అభిప్రాయంతో ఉంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
This website uses cookies.