నిర్మాణ రంగంలోని కొత్త బిల్డర్లకు ఉపయోగపడే విధంగా ఒక ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. క్రెడాయ్ తెలంగాణ స్టేట్ కాన్‌క్లేవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వాస్తవానికి ఇలాంటి ఎస్‌వోపీ పుస్తకాల్ని ప్రభుత్వం తయారు చేయాల్సి ఉంటుందన్నారు. కానీ, ఈ ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేషన్ ఆఫ్ ప్రొసీజర్) పుస్తకాన్ని క్రెడాయ్ తెలంగాణ రూపొందించడం అభినందనీయమని తెలిపారు. ఇతర నగరాలు, దేశాలకు చెందినవారు హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిపారు.
బెంగళూరు, పుణే వంటి నగరాలతో పోల్చితే హైదరాబాద్ ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. హెచ్ఆర్‌డీసీలో భాగంగా కొత్త లింకు రోడ్డుల్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈమధ్య కాలంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగంలో పలు రోడ్లను డెవలప్ చేశామన్నారు. కొత్త మున్సిపాలిటీల నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుంధానం చేసే పనుల్ని యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని వివరించారు. 2015 నుంచి తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. అప్పట్నంచి ప్రతిఏటా కొత్త ఆవిష్కరణల్ని చేపడుతూ ముందుకు దూసుకెళుతోందని చెప్పారు.
This website uses cookies.