- సామాన్యులు ప్లాట్లు కొనలేరు
- 30-40 కిలోమీటర్లు వెళితేనే ప్లాట్లు
- అక్కడ స్థలం కొన్నా.. రోజూ నగరానికి రాగలరా?
- స్థలాల ధరల్ని ఎవరైనా నియంత్రించగలరా?
- ఫామ్ హౌజ్ ప్లాట్లకు పెరుగుతున్న గిరాకీ
- హైదరాబాద్లో ఎప్పుడైనా స్థిరమైన ప్రగతి
- టీబీఎఫ్ అధ్యక్షుడు సీహెచ్ ప్రభాకర్ రావు
కొవిడ్ వల్ల రియల్ రంగం కుదేలైందని.. ఢమాల్ అయ్యిందని అనుకోవడం కరెక్టు కాదని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సీహెచ్ ప్రభాకర్ రావు తెలిపారు.
సాధారణ పరిస్థితుల్లో ప్రజలెవ్వరూ బయటికొచ్చి ఫ్లాట్లను కొనకపోతే అప్పుడు రియల్ రంగం దెబ్బతిన్నదని భావించాలన్నారు. ప్రజలు ఇంట్లో నుంచి బయటికి కాలు పెట్టలేని ఈ అసాధారణ పరిస్థితుల్లో మార్కెట్ దెబ్బతిన్నదని భావించడం కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు.హైదరాబాద్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. నేటికీ కొన్ని సంస్థలకు ఆన్ లైన్లో ఫ్లాట్ల బుకింగులు జరుగుతున్నాయని.. బ్యాంకు రుణాల్ని మంజూరు చేస్తున్నాయని వివరించారు. ఇంకా, ఏమన్నారో ఆయన మాటల్లోనే..
‘‘కరోనా నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ రియల్ రంగాన్ని అంచనా వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే, ప్రజలు ఇంట్లో నుంచి బయటికి వస్తేనే కొంటున్నారా? లేదా? అనే అంశాన్ని అంచనా వేయవచ్చు. కాకపోతే, ఇప్పుడా పరిస్థితి లేనే లేదు. కరోనా రాక ముందు వరకూ హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉందంటే.. ఐదేళ్ల తర్వాత ఫ్లాటు వస్తుందని ఎవరైనా బిల్డర్ అంటే.. అతను కడతాడో లేదో అనే విషయాన్ని అంచనా వేయకుండానే కొందరు కొనుగోలుదారులు ఫ్లాట్లను కొన్నారు. ఫ్లాట్లను కొనే శక్తి కొన్నవారికి ఉన్నంత కాలం నగరంలో రియల్ రంగానికి డిమాండ్ పడిపోతుందనే భయం లేదు.
కరోనా మొదటి వేవ్ వచ్చినప్పుడు.. ప్లాట్ల మీద ఎవరూ పెట్టుబడి పెట్టరని చాలామంది విశ్లేషించారు. కాకపోతే, ఆతర్వాత ఏం జరిగింది? హైదరాబాద్ నుంచి ఎంతో దూరంగా వెళ్లి మరీ భూముల్ని కొన్నవారున్నారు. అసలు ఆ భూములు పనికొస్తాయో లేవో అనే విషయాన్ని అంచనా వేయకుండానే తీసుకున్న వారి సంఖ్య తక్కువేం కాదు. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ మొదటి వేవ్ తర్వాత గేటెడ్ కమ్యూనిటీల కంటే భూముల మీద చాలా మంది పెట్టుబడి పెట్టారు.
స్థిరమైన ప్రగతి..
గత ముప్పయ్ ఐదేళ్ల రియల్ రంగం అనుభవంతో చెబుతున్నాను.. మిగతా నగరాలతో పోల్చితే ఏ రోజూ మన మార్కెట్ అనూహ్యంగా పెరగడం.. మళ్లీ అంతే స్పీడుతో పడిపోవడమంటూ జరగలేదు. ఎప్పుడు చూసినా స్థిరమైన ప్రగతి సాక్షాత్కరించింది. బిల్డర్లకు, కొనుగోలుదారులకు నేరుగా సంబంధం ఉండటం, మధ్యవర్తులకు పెద్దగా అవకాశం లేకపోవడం వంటి అంశాల కారణంగా.. మోసం జరుగుతుందనే భయం కొనుగోలుదారుల్లో పెద్దగా కనిపించలేదు. కొవిడ్ వల్ల తాత్కాలికంగా కొంత ఇబ్బందులు ఏర్పడినా.. ఈ రంగంలో పెట్టుబడి పెట్టకూడదని ఏ బిల్డరూ భావించడం లేదు.
మధ్యతరగతి ప్లాట్లా?
హైదరాబాద్లో మధ్యతరగతి ప్రజలు స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. కొంపల్లి దాటినా బాచుపల్లి దాటినా.. ఇలా ఏ పల్లి దాటిన ప్లాట్ల ధరలు ఆకాశాన్నంటాయి. హైదరాబాద్ నుంచి ముప్పయ్, నలభై కిలోమీటర్లు దాటి వెళితే తప్ప ప్లాటు కొనలేని పరిస్థితి నెలకొంది. కానీ, అక్కడ్నుంచి రోజూ ఆఫీసుకు రాగలడా? కాబట్టి, నగరంలోనే ఉండి, అరగంట లేదా గంటలోపు ఆఫీసుకు వెళ్లేలా ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారంతా ఫ్లాట్ల వైపే మొగ్గు చూపుతున్నారు.
అయితే, ప్రస్తుతం ప్లాట్లు కొనేవారు పెట్టుబడి కోణంలోనే కొంటున్నారు తప్ప నివసించడానికి కాదు. పది, ఇరవై ఏళ్ల తర్వాత డెవలప్ అవుతుందనే ఉద్దేశ్యంతో కొంటున్నారు. నివాసయోగ్యం కానీ భూములూ కోట్ల రూపాయలకు అమ్ముడవుతున్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం ఫామ్ హౌజ్ ప్లాట్లకు గిరాకీ పెరుగుతోంది. యాభై, అరవై కిలోమీటర్లు దాటిన తర్వాత డెబ్బయ్ లక్షల నుంచి కోటి రూపాయల్లోపు ప్రశాంతమైన వాతావరణంలో దొరికే ఇళ్లల్లో పెట్టుబడి పెట్టేందుకు చాలామంది ముందుకొస్తున్నారు.
స్థలాల ధరల్ని నియంత్రిస్తారా?
హైదరాబాద్లో స్థలాల ధరల్ని నియంత్రించే పరిస్థితి భూతద్దంలో వెతికినా కనిపించడం లేదు. స్థల యజమానులు ఇష్టారాజ్యంగా భూముల రేట్లను పెంచేస్తున్నారు. దీంతో పాటు స్టీలు, సిమెంటు ధరలు, నిర్మాణ సామగ్రి రేట్లు, కార్మికులకయ్యే ఖర్చు వంటివి పెరగడం వల్ల ఫ్లాట్ల ధరలు పెరుగుతున్నాయి. ప్రతి రంగానికి మారటోరియం లేదా సబ్సిడీలు ఇస్తున్నారు తప్ప నిర్మాణ రంగాన్ని విస్మరిస్తున్నారు. ఇతర రంగాల మీద లేని నియంత్రణలు.. నిర్మాణ రంగం మీద ఎందుకు విధించాలి? ఈ రంగాన్ని పరిరక్షించే విధంగా ప్రభుత్వం ఆపన్నహస్తం అందించాలి.
చిన్న ఫ్లాట్లకూ గిరాకీ
హైదరాబాద్లో అరవై నుంచి డెబ్బయ్ శాతం గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటే, మిగతా 30 నుంచి 40 శాతం ప్రజానీకం చిన్న ఫ్లాట్లు కావాలని కోరుతున్నారు. బడా ప్రాజెక్టుల్లో నిర్వహణ ఛార్జీలను కట్టలేమని వీరంతా అంటున్నారు. వీరికి జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటివి అవసరమే లేదు. ఇలాంటి వారంతా బాచుపల్లి, మేడ్చల్, నార్సింగి, బండ్లగూడ వంటి ఏరియాల్లో చిన్న ఫ్లాట్లను కొంటున్నారు. జూన్ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితి నెలకొంటుందని భావిస్తున్నాను.’’