- హైదరాబాద్ లోని 44 కాలనీల ప్రజలకు ఊరట
హైదరాబాద్ ఎల్బీ నగర్ తోపాటు మరో ఐదు నియోజకవర్గాల్లోని 44 కాలనీల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 15 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించింది. వారి భూములను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెం.118 తీసుకొచ్చింది. ఇటీవల సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన మన నగరం సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. తాము తీసుకున్న నిర్ణయం వేలాది కుటుంబాలకు ఎంతో ఊరట కల్పిస్తుందని వ్యాఖ్యానించారు. జీవో 118 ప్రకారం వెయ్యి గజాలలోపు భూమిని క్రమబద్ధీకరించనున్నారు.
చదరపు గజానికి రూ.250 ఫీజు నిర్ధారించారు. ఈ మొత్తాన్ని ఆరు నెలల్లో నాలుగు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. ‘ఇది ఈ నాటి పోరాటం కాదు. ప్రజలు ఈ సమస్యపై గత 15 ఏళ్లుగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో చట్టపరంగా ఎలాంటి చిక్కులూ తలెత్తకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుని భూములను క్రమబద్ధీకరిస్తున్నాం. దరఖాస్తు చేసుకున్న అనంతరం ఆరునెలల్లో రిజిస్ట్రేషన్ చేసి పట్టా అందజేస్తాం’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, హైదరాబాద్ జిల్లాల్లో రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, నాంపల్లి, కార్వాన్, మేడ్చల్, ఎల్బీ నగర్ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే 44 కాలనీల్లో ఈ రిజిస్ట్రేషన్ సమస్య 2007 నుంచి నెలకొని ఉంది. సర్కారు తాజా నిర్ణయంతో ఇది ఓ కొలిక్కి వచ్చింది.