Categories: TOP STORIES

కాసుల కోస‌మే మ‌ళ్లీ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌?

కేవ‌లం కాసుల కోస‌మే మళ్లీ ఇళ్ల స్థ‌లాల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణకు ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించిందా? ప‌శ్చిమ హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో కొంద‌రు బ‌డా బాబులు అక్ర‌మంగా నిర్మించుకున్న ఇళ్ల‌ను రెగ్యుల‌రైజ్ చేయ‌డానికే ఈ త‌తంగాన్ని మ‌ళ్లీ వెలుగులోకి తెచ్చారా? ఏదీఏమైతేనేం.. మ‌రోసారి జీవో 58, 59 కింద క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ జీవో నె.14ను సోమ‌వారం జారీ చేశారు.

ఈ నెల 21 నుంచి మార్చి 31వ తేదీ వరకు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇదే చివరి అవకాశమని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2014 డిసెంబర్ 30వ తేదీన రెండు జీవోల‌ను విడుదల చేసింది. జీవో 58 ప్రకారం 125 చదరపు గజాల్లోపు ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి, జిఓ 59 ప్రకారం ఆపై తరగతికి చెందిన ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను రెగ్యుల‌రైజ్ చేస్తారు. స్థ‌ల విస్తీర్ణం ఆధారంగా ప్రభుత్వం ధరలను ఖరారు చేస్తుంద‌న్న విష‌యం తెలిసిందే. ఇలా 2014, 2015, 2017 సంవత్సరంలో ఫ్రిబవరిలో ఒకసారి, డిసెంబర్‌లో మరోసారి పేదలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 11.19 లక్షల దరఖాస్తులు రాగా, ఉచితంగా 6.18 లక్షల మంది దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించింది. మిగతా వాటికి వాటి విస్తీర్ణం ఆధారంగా ధర నిర్ణయించి క్రమబద్ధీకరించింది. వీటి పరిష్కారానికి ఆర్డీవో నేతృత్వంలోని తహసీల్దారుల‌తో కూడిన కమిటీలను ప్రభుత్వం నియమించడంతో పాటు వాటి పరిష్కారానికి 90 రోజుల గ‌డువునిచ్చింది. మ‌రి, ఈసారి ఎంత‌మంది అక్ర‌మార్కులు ఈ తాజా నిర్ణ‌యం వ‌ల్ల త‌మ అక్ర‌మ నిర్మాణాల్ని స‌క్ర‌మం చేసుకుంటారో తెలియాలంటే కొంత కాలం వేచి చూస్తే స‌రిపోతుంది.

This website uses cookies.