Categories: Rera

హరియాణా రెరాను చూసి.. తెలంగాణ ఎంతో నేర్చుకోవాలి

  • అక్రమంగా ప్లాట్ల విక్రయం..
  • బిల్డర్ కు రూ.2.5 కోట్ల జరిమానా
  • సీఎం కేసీఆర్ రెరాను బలోపేతం చేయాలి

భారతదేశ రాజకీయాల్లో సత్తాను చాటడానికి ఉరకలేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు.. మన రెరా అథారిటీని ఎందుకు గాలికొదిలేశారో అర్థం కావట్లేదని ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణ రియల్ రంగంలో కొందరు అక్రమార్కులు సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం కష్టార్జితాన్ని దోచుకుంటుంటే.. కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో రెరా వచ్చాక ప్రీలాంచ్ స్కాములకు అడ్డుకట్ట పడింది. కానీ, తెలంగాణలో మాత్రం సరికొత్త స్కాములకు తెరలేచింది. యూడీఎస్, ప్రీలాంచ్, ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటూ రకరకాలుగా బిల్డర్లు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. మన వద్ద రెరా అథారిటీ సక్రమంగా పని చేయకపోవడం వల్లే ఈ సమస్య అని నగర నిర్మాణ సంఘాలూ అభిప్రాయపడుతున్నాయి. ఇక్కడి రెరా అథారిటీ పూర్తిగా నిర్వీర్యమైందని అంటున్నాయి. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు.. కొందరు రియల్టర్లు, డెవలపర్లు.. రెరాను పట్టించుకోకుండా తక్కువ రేటు అంటూ ఆశ చూపెట్టి.. ప్రజల సొమ్మును అప్పన్నంగా లాగేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రెరాను బేఖాతరు చేస్తూ.. ప్రీలాంచుల్లో ప్లాట్లు, ఫ్లాట్లు, వీకెండ్ విల్లాలు, ఫామ్ ప్లాట్లను అమ్ముతూ.. ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారని ఆక్రోశం వెళ్లగక్కుతున్నాయి. అయినా, కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తకుండా వ్యవహరించడం దారుణమని అభిప్రాయపడుతున్నాయి. మరి, ఇలాంటి అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వంపై ఉందా? లేదా?

హరియాణా వంటి రాష్ట్రంలో కూడా రెరా సమర్థంగా పని చేస్తుంటే.. తెలంగాణలో ఎందుకీ అథారిటీ సక్రమంగా పని చేయట్లేదు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం రెరా అప్పీలేట్ అథారిటీని నియమించట్లేదు? కావాలంటే, ఇటీవల రెరా అథారిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడండి.. ఒక ప్రాజెక్టును రెరా వద్ద రిజిస్టర్ చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను విక్రయిస్తున్న బిల్డర్ పై రెరా కన్నెర్ర చేసింది.  గురుగ్రామ్ సెక్టార్ 61 నుంచి 65 వరకు బ్రహ్మ సిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బ్రహ్మ సిటీ పేరుతో ఓ ప్రాజెక్టు చేపట్టింది. అయితే, దీనిని హరియాణా రెరా వద్ద రిజిస్టర్ చేయలేదు. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా 219 ప్లాట్లను అమ్మేసింది. ఈ విషయం రెరా దృష్టికి రావడంతో ఆ సంస్థపై రూ.2.5 కోట్ల జరిమానా విధించింది. మరి, ఇలా తెలంగాణ రెరా అథారిటీ ఎందుకు కఠినంగా వ్యవహరించట్లేదు. ఈ సంస్థ తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించకుండా ఎవరు అడ్డుకట్ట వేస్తున్నారు?

సాహితీ వంటి సంస్థ 2500 మంది కొనుగోలుదారుల నుంచి రూ.900 కోట్లు వసూలు చేసి చేతులెత్తేసింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రైతులు, ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగులు.. ఊర్లో ఉన్న స్థలమో పోలమో అమ్మేసి.. సాహితీ సంస్థ వద్ద ఫ్లాట్లను కొనుగోలు చేశారు. తీరా, సంస్థ ఎండీ లక్ష్మీనారాయణ కటకటాల్లోకి చేరడంతో ఏం చేయాలో అర్థం కాక.. బయ్యర్లు మొత్తం తల పట్టుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. అతిత్వరలో ఇలాంటి ప్రీలాంచ్ బాధితులు అనేక మంది రోడ్డుమీదికొచ్చే అవకాశముంది. కాబట్టి, ఇప్పటికైనా ప్రీలాంచ్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. లేకపోతే, ఈ ప్రీలాంచ్ సమస్యలే ప్రభుత్వాన్ని ఇబ్బంది కలిగించే ఆస్కారముంది.

This website uses cookies.