మీనాక్షి సుందరేశ్వర్, గుడ్ న్యూస్, బ్రీత్ సినిమాలలో తన పాత్రలతో అలరించిన నటి అర్చన అయ్యర్.. పరిపూర్ణమైన ఇంటిని సొంతం చేసుకోవాలన్న తన జీవితకాల కల గురించి ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడారు. తండ్రి ఉద్యోగరీత్యా చిన్నతనంలో తరచూ పలు ఇళ్లు మారిన ఆమె.. ప్రతి ఇంట్లో బోలెడు జ్ఞాపకాలను మూటగట్టుకున్నారు. ఆ ప్రయాణంలో ఏర్పడిన శాశ్వత స్నేహాలను గుర్తుచేసుకున్నారు. ‘నేను చిన్నపుడు అద్దె ఇళ్లలో ఉండేదాన్ని. మా నాన్న ఉద్యోగం కారణంగా అనేక ఇళ్లు మారాం. మేం ఇల్లు మారిన ప్రతిసారీ నాకు చాలామంది కొత్తవారు స్నేహితులుగా అయ్యేవారు. ప్రస్తుతం వారందరితో ఎంతో సంతోషమైన క్షణాలను ఆస్వాదిస్తుంటాను. ప్రతి ఇంట్లోనూ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి’ అని వెల్లడించారు.
అర్చన తనకు సొంతంగా ఓ అభయారణ్యం వంటి ఇల్లు ఉండాలనేది కోరిక. అది అందం కోసమే కాదు.. వృత్తిరీత్యా తీవ్రమైన పని ఒత్తిడిలో ఉండే ఆమెకు అది ఓ ఓదార్పునిచ్చేది అవ్వాలన్నదే మరో కారణం. పెయింటింగ్ నుంచి లైటింగ్ వరకు ప్రతి అంశంలోనూ నా ఇంటిని సొంతంగా డిజైన్ చేసుకోవడం తనకు చాలా ఇష్టమని అర్చన చెప్పారు. ‘తీరికలేని షూటింగ్ తర్వాత శాంతిని చేకూర్చి సేదతీర్చేది ఇల్లు మాత్రమే. అందువల్ల ఇంటిని చాలా సౌందర్యంగా, ప్రత్యేకంగా ఉంచడం నాకు చాలా ఇష్టం’ అని తెలిపారు.
పాస్టెల్ ఇంటీరియర్స్, పురాతన ఫర్నిచర్ తో అలంకరించిన విశాలమైన విల్లా కావాలనేది అర్చన కల. తనకు వంట అంటే ఎంతో ఇష్టమని చెప్పి అర్చన.. వంటగది అనేది తన భవిష్యత్ ఇంటికి కేంద్రంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘నా వంటగది ఇంటికి గుండెగా ఉండాలని కోరుకుంటున్నాను. అక్కడ నేను ఎక్కువ సమయం గడుపుతాను. ఇక నా బెడ్ రూమ్ విషయానికి వస్తే.. అది డిమ్ లైటింగ్, ఆకర్షణీయమైన పెయింటింగ్ లతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
హైదరాబాద్ తో తనకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ.. తన మొదటి ఇంటిని ఇక్కడే కట్టుకోవాలన్న ఆకాంక్షను వెల్లడించారు. ‘హైదరాబాద్ తో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. ఇక్కడ నా కలల నిలయంలో సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నాను’ అని స్పష్టంచేశారు. ఇంటీరియర్ డిజైన్ గురించి ఆమెను అడగ్గా.. ఈ విషయంలో మన ముద్ర ఉండాల్సిందేనని పేర్కొన్నారు. ‘ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చాలా ముఖ్యం. దీనిని సొంతంగా చేయడం నాకు చాలా ఇష్టం. మన ఇంటికి సంబంధించి ఏదైనా మనం చేయగలం. అలాగే నా ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్ ను వీలైనంత అందంగా డిజైన్ చేయాలనుకుంటున్నాను’ అని చెప్పారు. ఆమె తన కలల ఇంటిని పూర్త సానుకూల, వెచ్చనైన హాయితో నింపాలని భావిస్తున్నారు. తన ఇల్లు తనకు అనుగుణంగా తనదైన ముద్రతో ప్రత్యేకంగా ఉండాలనేది ఆమె ఆకాంక్ష. ‘నా ఇంట్లోకి మీరు అడుగుపెట్టిన వెంటనే సానుకూల దృక్పథం కనిపించాలి’ అని చెప్పి ముగించారు.
This website uses cookies.