Categories: Celebrity Homes

యూడీఎస్‌పై ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపాలి

  • క్రెడాయ్ నేష‌న‌ల్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మి రాంరెడ్డి
  • మెట్రో న‌గ‌రాల్లో మార్కెట్ మెరుగ‌వుతోంది
  • హైద‌రాబాద్‌లో ఫ్లాట్లు సామాన్యుల‌కు భారం
  • ప్ర‌భుత్వం అందుబాటు గృహాల్ని ప్రోత్స‌హించాలి

(కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌, regpaper21@gmail.com): సూప‌ర్ టెక్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు దేశీయ డెవ‌ల‌ప‌ర్ల‌కు పెద్ద గుణ‌పాఠ‌మ‌ని.. ఇక నుంచి అక్ర‌మ రీతిలో అపార్టుమెంట్ల‌ను క‌ట్ట‌డానికి దేశ‌వ్యాప్తంగా ఏ బిల్డ‌రూ సాహ‌సించ‌ర‌ని క్రెడాయ్ నేష‌న‌ల్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మి రాంరెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. దేశీయ నిర్మాణ రంగానికెంత కీల‌క‌మైన ఫెస్టివ‌ల్ సీజ‌న్ ఆరంభ‌మైన సంద‌ర్భంగా ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ గురుతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. భార‌త‌దేశంలో నిర్మాణ రంగం, తెలుగు రాష్ట్రాల్లో రియ‌ల్ ప‌రిస్థితులు వంటి కీల‌క అంశాల‌పై త‌న అభిప్రాయాల్ని వ్య‌క్తం చేశారు. మ‌రి, గుమ్మి రాంరెడ్డి ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే..

సూప‌ర్ టెక్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు బిల్డ‌ర్ల‌కు చెంపపెట్టు లాంటిది. ఇక నుంచి ఓపెన్ స్పేసెస్‌లో అపార్టుమెంట్ల‌ను నిర్మించ‌డానికి ఎవ‌రూ సాహించ‌రు. కాక‌పోతే, అక్ర‌మంగా క‌ట్టిన నిర్మాణాల్ని కూల్చివేయ‌డం బ‌దులు ప్ర‌త్యామ్నాయ నిర్ణ‌యం తీసుకుంటే బాగుంటుంది. కొచ్చిన్‌లో నాలుగు బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలైనా.. నొయిడాలో 40 అంత‌స్తుల సూప‌ర్ టెక్ క‌ట్ట‌డ‌మైనా.. నిర్మించేందుకు ఎన్ని ట‌న్నుల సిమెంటు, స్టీలు, ఇసుక‌ వాడి ఉంటారు? మ‌రి, వాటిని కూల్చివేస్తే ఎంత జాతీయ సంప‌ద వృథా అవుతుంది. ప‌ర్యావ‌ర‌ణానికి ఎంత హానీ త‌ల‌పెడితే ట‌న్నుల కొద్దీ సిమెంటు, స్టీలు త‌యార‌వుతుందో తెలుసు క‌దా. మ‌రి, ప్ర‌కృతి అంద‌జేసే సంప‌ద‌ను వృథా చేస్తే ఎలా? కాబ‌ట్టి, కూల్చివేతకు బ‌దులుగా అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే విధంగా ఏదో ఒక ప్ర‌త్యామ్నాయ నిర్ణ‌యం తీసుకుంటే బాగుంటుంది.

కూల్చివేత క‌రెక్టు కాదేమో..

కొచ్చిన్‌, నొయిడా వంటి ఉదంతాల్లో అధికారుల పాత్ర గురించి ప్ర‌భుత్వం విచారించాల్సిందే. ఏదో కంటితుడుపు చ‌ర్య‌లు తీసుకోకుండా వారిని క‌ఠినంగా శిక్షించాలి. ఒక‌ట్రెండేళ్లు ఉద్యోగంలో నుంచి తొల‌గించి, మ‌ళ్లీ ఏదో ఒక పోస్టు ఇచ్చేలా నిబంధ‌న‌లు ఉండ‌కూడ‌దు. ఇలా చేస్తే అధికారుల‌ ప్ర‌వ‌ర్త‌న మారే ప్ర‌స‌క్తే ఉండ‌దు. నెల‌కు ల‌క్ష రూపాయ‌ల జీత‌మున్న అధికారుల‌కు ఒకేసారి ఒక‌టి లేదా రెండు కోట్లు లంచం చేతికొచ్చిన త‌ర్వాత‌.. అత‌న్ని ఒక‌ట్రెండేళ్ల పాటు ఉద్యోగంలో నుంచి స‌స్సెండ్ చేసినంత మాత్రాన న‌ష్ట‌మేం ఉంటుంది చెప్పండి? కాబ‌ట్టి, అవినీతిని స‌మూలంగా నిర్మూలించేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన నిర్ణ‌యాల్ని తీసుకోవాలి. అప్పుడే వ్య‌వ‌స్థ‌లో మార్పు వ‌స్తుంది. ఇలాంటి ఉదంతాలు జ‌ర‌గకుండా ఉంటాయి.

ఇక వ‌ర్క్ ఫ్ర‌మ్ ఆఫీసు..

దేశంలో పండ‌గ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ప‌లు న‌గ‌రాల్లో రియ‌ల్ రంగంలో ప‌రిస్థితులు క్ర‌మ‌క్ర‌మంగా సానుకూలంగా మారుతున్నాయి. ముంబై, బెంగ‌ళూరు, పుణే మార్కెట్లు క్ర‌మ‌క్ర‌మంగా కోలుకుంటున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొన్ని న‌గ‌రాల్లో ఇళ్ల అమ్మ‌కాలు మెరుగ్గానే జ‌రుగుతున్నాయ‌ని తెలిసింది. రానున్న రోజుల్లో వర్క్ ఫ్ర‌మ్ హోమ్ బ‌దులు ఉద్యోగుల్ని ఆఫీసుకు ర‌మ్మ‌ని సంస్థ‌లు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న ఇప్ప‌టికే టాటా చేసింది. దేశ‌వ్యాప్తంగా అందుబాటు గృహాల్ని ప్రోత్స‌హించేందుకు సీఎల్ఎస్ఎస్ (క‌న్‌స్ట్ర‌క్ష‌న్ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌), సెక్ష‌న్ 80 ఐబీ వంటి వాటిని కేంద్ర ప్ర‌భుత్వం పొడిగించాలి.

మ‌ధ్య‌త‌ర‌గ‌తికి దూరం..

హైద‌రాబాద్‌లో మార్కెట్ మెరుగ్గా ఉన్న‌ప్ప‌టికీ.. ధ‌ర‌లు పెర‌గ‌డం వ‌ల్ల‌..సామాన్యుల‌కు దూర‌మ‌వుతోంది. ఇది చాలా బాధాక‌ర‌మైన విష‌యం. ఎందుకంటే, ప్ర‌భుత్వమే వేలం పాట‌ల్ని నిర్వ‌హిస్తూ.. భూముల ధ‌ర‌లు స్థిర‌ప‌డేలా చేస్తోంది. ఫ‌లితంగా, స్థ‌లాల రేట్ల‌కు రెక్క‌లొచ్చేశాయి. దీంతో, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు సొంతిల్లు కొనుక్కోలేని దుస్థితి ఏర్ప‌డింది. దీన్ని అధిగ‌మించాలంటే, ప్ర‌భుత్వం ఒక అడుగు ముందుకేసి.. అందుబాటు గృహాల్ని ప్రోత్స‌హించాలి. వీటిని క‌ట్టేవారికి కొన్ని రాయితీల‌ను ప్ర‌క‌టించాలి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌ను ఒక శాతం చేయాలి. వీలైతే, భూముల్ని నామ‌మాత్ర‌పు రేటుకు కేటాయించాలి. ఇప్పుడు నిర్ణ‌యం తీసుకోక‌పోతే, ముంబైలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితులే త్వ‌ర‌లో ఏర్ప‌డినా ఆశ్చ‌ర్య‌ప‌డ‌క్క‌ర్లేదు. ఉమ్మ‌డి రాష్ట్రంలో అప్ప‌టి ప్ర‌భుత్వం క‌ట్టిన రాజీవ్ స్వ‌గృహ వంటి ప్రాజెక్టులు విజ‌య‌వంతం కాలేవు. తెలంగాణ ఏర్ప‌డి ఏడేళ్లు దాటినా ఇప్ప‌టికీ ఆ గృహాలు అలాగే ఉన్నాయి. వాటిని అప్పుడే ప్రైవేటు డెవ‌ల‌ప‌ర్ల‌కు అప్ప‌గించినా.. లేదా ప్ర‌భుత్వ‌మే ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుని విక్ర‌యిస్తే బాగుండేది. ప్రైవేటు సంస్థ‌ల‌కు అలాంటి నిర్మాణాల్ని అప్ప‌గిస్తే ప‌నులు నిలిచిపోతాయా చెప్పండి? కాబ‌ట్టి, వీటి విష‌యంలో త్వ‌రగా నిర్ణ‌యం తీసుకోవాలి.

యూడీఎస్ దారుణం..

హైద‌రాబాద్‌లో యూడీఎస్ విధానంలో ఫ్లాట్ల‌ను విక్ర‌యించ‌డం దారుణ‌మైన విష‌యం. ఎవ‌రు ప‌డితే వాళ్లు ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నారు. స‌ద‌రు బిల్డ‌ర్లు అపార్టుమెంట్ను నిర్మించి ఇవ్వ‌గ‌ల‌రా? అంత సామ‌ర్థ్యం ఉందా? మ‌ధ్య‌లో వ‌దిలేస్తే ఎలా.. త‌దిత‌ర అంశాల‌పై కొనుగోలుదారులు ఆలోచించ‌డం లేద‌నిపిస్తోంది. ప్ర‌తిఒక్క‌రూ స‌గం రేటుకే ఫ్లాటు వ‌స్తుంద‌ని అనుకుంటున్నారు త‌ప్ప‌.. నిర్మాణం పూర్త‌వుతుందా? లేదా? అనే అంశం గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. లక్ష చ‌ద‌ర‌పు అడుగుల నిర్మాణాల్ని క‌ట్టిన అనుభ‌వం లేనివారూ ప్ర‌స్తుతం రెండు నుంచి మూడు మిలియ‌న్ల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి వారికి అడ్డుక‌ట్ట వేయ‌డానికి, ప్ర‌భుత్వ‌మే కొన్ని క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకోవాలి.

30 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల్లో..

బాచుప‌ల్లిలో 10 అంత‌స్తుల ఆర్క్ స‌మ్య‌క్‌, కొల్లూరులో 15 అంత‌స్తుల ఆర్క్ స్థిర, బెంగ‌ళూరులో 9 అంత‌స్తుల ఆర్క్ ఓక్ సిటీ వంటి ప్రాజెక్టుల్ని క‌ట్టేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాను. ఇవి ప్ర‌స్తుతం అనుమ‌తుల ద‌శ‌లో ఉన్నాయి. ఈ మూడింటిలో 11 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని అభివృద్ధి చేస్తున్నాను. ఈ ఏడాదిలోనే రామంత‌పూర్‌, గాజుల‌రామారం వంటి ప్రాంతాల్లో నిర్మాణాల్ని క‌డ‌తాను. ఎలా లేద‌న్నా.. వ‌చ్చే ఆరు నెల‌ల్లో మ‌రో 19 ల‌క్ష‌ల చద‌ర‌పు అడుగుల్లో నిర్మాణాల్ని ఆరంభిస్తాను. మొత్తానికి, నిర్దేశించుకున్న ల‌క్ష్యానికి చేరుకునే దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు ముందుకేస్తున్నాను.

సామాన్యులు ఇబ్బంది ప‌డొద్దు

యూడీఎస్ లో కొంద‌రు బిల్డ‌ర్లు చేస్తున్న అమ్మ‌కాల్ని గ‌మ‌నిస్తుంటే ఒక్కోసారి భ‌య‌మేస్తోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పెరిగిన నిర్మాణ ఖ‌ర్చును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే, స‌గం ధ‌ర‌కే కొంద‌రు ఫ్లాట్ల‌ను ఎలా విక్ర‌యిస్తున్నారో అర్థం కావ‌డం లేదు. వీటిని చెప్పిన‌ట్లుగా నిర్మిస్తే ఎవ‌రికీ ఇబ్బందులుండ‌వు. కాక‌పోతే, ఏదో ఒక కార‌ణం వ‌ల్ల ఆయా నిర్మాణాలు నిలిచిపోతే, అందులో కొన్న‌వాళ్లు దారుణంగా ఇబ్బంది ప‌డ‌తారు. కాబ‌ట్టి, వీటిని ఎట్టి ప‌రిస్థితుల్లో ప్రోత్స‌హించ‌కూడ‌దు. యూడీఎస్ అమ్మ‌కాల‌పై ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపాలి. ఇందుకు సంబంధించి త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోక‌పోతే.. సామాన్యులు మోస‌పోయే ప్ర‌మాద‌ముంది.

This website uses cookies.