ఆన్ లైన్ లో హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం రేటు పెరగడానికి కారణం!
హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న వేలం పాటలకు అపూర్వమైన ఆదరణ లభిస్తున్నందుకు సంతోషించాలో.. సామాన్యులకు ప్లాట్ల ధరలు అందుబాటులో లేకుండా పోతుండటాన్ని చూసి ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తుర్కయాంజాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిన్నటివరకూ గజం రూ. 30 వేలకు అటుఇటుగా ఉండేది. కానీ, నేడో.. హెచ్ఎండీఏ పుణ్యమా అంటూ ఏకంగా రూ.62,500కు పెరిగింది. అంటే, దీన్ని బట్టి ఇక్కడ తుర్కయంజాల్‌లో కనీస ధర సుమారు అరవై వేలకు చేరిందన్నమాట. 2014లో గజం ధర పది వేలకు అటు ఇటుగా ఉండేదీ ప్రాంతంలో. అలాంటిది, గత ఎనిమిదేళ్లలో అరవై వేలకు చేరుకుంది. పోనీ, ఆయా ప్రాంతంలో మౌలిక సదుపాయాల్లో గణనీయమైన పురోగతి సాధించిందా? అంటే అదీ లేదు.
బహుదూర్ పల్లిలో అత్యధికంగా గజం రూ.42,000లకు కొందరు బిడ్డర్లు కొనుగోలు చేశారు. కొంతమంది రియల్టర్లు, ప్రమోటర్లు కావాలనే.. ఈ ప్రాంతంలో రేట్లు పెంచాలనే ఉద్దేశ్యంతో.. ఇలా అధిక రేటు పెట్టి కొన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటివరకూ గజం రూ.25 వేలకు అటుఇటుగా ఉన్న ధర.. ప్రస్తుతం 42 వేలకు చేరింది. అంటే, గజం ధర సుమారు రూ.40 వేలుగా స్థిరపడిందని చెప్పొచ్చు. ఇక నుంచి ఎవరు అమ్మాలన్నా.. కొనాలన్నా.. ఇదే ధర ప్రామాణికంగా తీసుకుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొత్తానికి, హైదరాబాద్‌లో సామాన్యులకు ప్లాట్లను దూరం చేస్తున్న ఘనత హెచ్ఎండీఏకే దక్కుతుందని మధ్యతరగతి ప్రజానీకం అభిప్రాయపడుతోంది. ఇలా వేలం పాటలో ప్లాట్లను వేలం వేయకుండా.. ఒక ప్రామాణిక ధరను నిర్ణయించి.. కనీసం sreeలాటరీలోనైనా కేటాయించాలి. అప్పుడే సామాన్యులు సులువుగా ప్లాట్లను కొనుగోలు చేసి ఇళ్లను కట్టుకుంటారు.