- తెలంగాణ డెవలపర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జీవీ రావు
జీవో 111 కింద 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాల భూముల అంశాన్ని సామాజిక ఆర్థిక అంశంగా చూడాలని తెలంగాణ డెవలపర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జీవీ రావు పేర్కొన్నారు. ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేతపై ఆయన రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడారు. ఆ 84 గ్రామాలను ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.
‘తాము వెనకబడి ఉన్నామని, హైదరాబాద్ ఫలితాలు తమకు దక్కలేదన్నది ఆ 84 గ్రామాల ప్రజల వాదనను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం జీవో 111 ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఇది హైదరాబాద్ కు లాభమా లేక నష్టమా అనే అంశాలను పరిశీలించాలి. 84 గ్రామాలకు ఆర్థిక లబ్ధి, హైదరాబాద్ నగరానికి సామాజిక లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అనేది ఇక్కడ చాలా కీలకం. ఇది చేయకుంటే హైదరాబాద్ కు నష్టం వస్తుంది. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అనుకూల మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. వాన నీరు జలాశయాల్లోకి వెళ్లాలి? మురుగునీటిని ఎలా పంపించాలి? రవాణా పరిస్థితి ఏమిటి వంటి అంశాలను చూసుకోవాలి. ముఖ్యంగా చెట్లను కాపాడుకోవాలి.