Categories: LEGAL

సాహిత్య హౌసింగ్ ఎండీకి మూడేళ్ల జైలు

వినియోగదారుల కమిషన్ తీర్పును అమలు చేయనందుకు సాహిత్య హౌసింగ్ ఎండీ టి.వీరయ్య చౌదరికి జైలు శిక్ష విధిస్తూ జిల్లా వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పును రాష్ట్ర వినియోగదారుల కమిషన్ సమర్థించింది. ఒప్పందం అమల్లో విఫలమైనందుకు సొమ్మును వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. తీర్పును అమలు చేయని వీరయ్య చౌదరికి విధించిన శిక్ష విషయంలో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. నిర్మాణానికి సంబంధించి ఒప్పందం అమలు చేయకపోవడంతో కృష్ణా జిల్లాకు చెందిన ఎం.కోటేశ్వరమ్మ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిని విచారించిన కమిషన్.. రూ.7.8 లక్షల మొత్తాన్ని 12 శాతం వడ్డీతో కోటేశ్వరమ్మకు చెల్లించాలని తీర్పునిచ్చింది.

అయితే, వీరయ్య చౌదరి ఈ తీర్పును అమలు చేయకపోవడంతో కోటేశ్వరమ్మ మళ్ళీ కమిషన్ ఆశ్రయించారు. అయితే, దీనిపై తాను రాష్ట్ర, జాతీయ కమిషన్లను ఆశ్రయించానని చెబుతూ వీరయ్య చౌదరి గడువు తీసుకుంటూ వచ్చారు. చివరకు ఆయన అప్పీళ్లను రాష్ట్ర, జాతీయ కమిషన్లు కొట్టివేశాయి. అయినా తమ ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో 2018 ఏప్రిల్ లో టి.వీరయ్య చౌదరికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ జిల్లా కమిషన్ తీర్పునిచ్చింది. దీనిపై వీరయ్య చౌదరి రాష్ట్ర కమిషన్ లో అప్పీలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కేసు విచారణ 25 సార్లు వాయిదా పడింది. మొదటి రెండు వాయిదాలకు ఇరు పక్షాలు హాజరుకాగా, తర్వాత నుంచి ఎవరూ హాజరు కాలేదు. దీంతో కేసు పూర్వాపరాల ఆధారంగా రాష్ట్ర కమిషన్ తీర్పు వెలువరించింది. జిల్లా కమిషన్ తీర్పును సమర్థించింది.

This website uses cookies.