స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ విప్లవాత్మకమైన జీవోకు ఆయన పచ్చజెండా ఊపారు. ఆ తర్వాత అదే మన నిర్మాణ రంగానికో దిక్సూచిగా మారింది. అదే జీవో నెం. 86. ఆ జీవోలో మార్టిగేజ్ నిబంధనను అప్పటి ప్రణాళికా అధికారులు చేర్చడంతో.. అక్రమ నిర్మాణాలు చేపట్టేవారంతా సక్రమంగా కట్టడం ఆరంభించారు. ఫలితంగా హైదరాబాద్ నిర్మాణ రంగమంతా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందడం ఆరంభమైంది. కాకపోతే, అదే జీవోలో అపరిమిత ఎఫ్ఎస్ఐకి అనుమతినిచ్చారు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాల్సిన తరుణం ఏర్పడింది.
భారతదేశంలోని ఏ ఇతర నగరంలో లేని సౌలభ్యం.. కేవలం హైదరాబాద్లోనే ఉంది. ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో కూడా ఇలాంటి నిబంధన లేనే లేదు. అందుకే, జాతీయ డెవలపర్లు భాగ్యనగరం వైపు ఆసక్తి చూపిస్తుంటారు. అన్ లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ.. అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్.. అంటే ప్లాటు విస్తీర్ణం బట్టి ఎంత ఎత్తు వరకైనా నిర్మాణాల్ని చేపట్టే నిబంధన అన్నమాట. గత ఆరేళ్ల నుంచి అర్బన్ ప్లానర్లు దూరదృష్టితో ఆలోచించకపోవడం.. రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల.. ఔటర్ రింగ్ రోడ్డు సర్వీసు రోడ్డు పక్కనే ఆకాశహర్మ్యాలకు అనుమతుల్ని మంజూరు చేస్తున్నారు.
ఆయా సర్వీసు రోడ్డు విస్తీర్ణం తక్కువ ఉండటం.. దాని పక్కనే నిర్మాణాల్ని అనుమతించడంతో.. రోడ్డు ప్రమాదాలకు అధిక ఆస్కారం ఏర్పడుతోంది. పైగా, ఆఫీసులంటూ ఆరంభమైతే ఈ సర్వీస్ రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. మౌలిక సదుపాయాలు ఏర్పడకపోవడంతో ఆయా ప్రాంతాలన్నీ అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. ఇలాగే, నిర్మాణాల సంఖ్య పెరుగుకుంటూ పోతే మూడు, నాలుగేళ్లలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతమంతా అస్తవ్యస్తంగా తయారయ్యే ప్రమాదముంది. కాబట్టి, ఇప్పటికైనా నగర పట్టణ ప్రణాళిక అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి.. ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు విధిస్తే మంచిది.
మౌలిక ఒత్తిడి ఖాయం..
ముంబై వంటి నగరంలో అత్యంత ఎత్తయిన భవనాలు ఉన్నప్పటికీ, అక్కడ ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉంది. అదే, హైదరాబాద్ ను తీసుకుంటే, ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామే కనిపిస్తుంది. హైదరాబాద్లో పటిష్ఠమైన ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయలేదు. అపరిమిత ఎఫ్ఎస్ఐ వల్ల ఆకాశహర్మ్యాలకు అనుమతులిచ్చుకుంటూ వెళితే.. రానున్న రోజుల్లో మంచినీరు, విద్యుత్తు, డ్రైనేజీ వంటి సౌకర్యాల మీద ఎనలేని ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, వీటిపై పెరిగే ఒత్తిడిని పక్కాగా నిర్థారించి అనుమతుల్ని మంజూరు చేయాలి. ఒకసారి నిర్మాణాలు కట్టేసిన తర్వాత చేయడానికీ ఏమీ ఉండదు కాబట్టి, ముందే మన ప్రణాళికా అధికారులు ఇలాంటి వ్యూహాత్మకమైన అంశాలపై దృష్టి సారించాలి. భవిష్యత్తుతరాలకు ఓ ప్రణాళికాబద్ధమైన సుందర నగరాన్ని అందించాల్సిన బాధ్యత పాలకులతో బాటు పురపాలక అధికారులకూ ఉంది.