ఇంట్లో కూర్చున్న చోట నుంచే ఇంటి నిర్మాణ అనుమతి పొందవచ్చని.. ఇలాంటి మరిన్ని ప్రయోజనాలు నూతన నిర్మాణ అనుమతుల విధానం ‘బిల్డ్ నౌ’ తో ప్రజలకు చేరువ కానుందని పురపాలక శాఖ అంటుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్‌బీపాస్ ప్రవేశపెట్టినప్పుడూ ఇదే విధంగా గొప్పలు చెప్పారు. 21 రోజుల్లోపు అనుమతిని మంజూరు చేయకపోతే, ఆయా అధికారులపై జరిమానా విధిస్తామని ఎక్కడపడితే అక్కడ ప్రచారాన్ని నిర్వహించారు.
కానీ, వాస్తవంగా జరిగిందేమటి? 21 రోజులు కాదు కదా.. రెండు నెలల పది రోజులు దాటిన తర్వాత కూడా అనుమతులు వచ్చేవి కాదు. అందుకే, ఎన్ని యాప్‌లు తెచ్చినా ప్రయోజనం ఉండదని.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీ అధికారులు, సిబ్బంది ఆలోచన విధానం మరనంత వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాసులు అందుకోనిదే టౌన్ ప్లాన్ సిబ్బంది.. అంత సులువుగా అనుమతుల్ని మంజూరు చేయరే చేయరని జగమెరిగిన సత్యమని ప్రజలు అంటున్నారు. కాకపోతే, బిల్ట్ నౌ పనితీరు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పురపాలక శాఖ గొప్పలు చెప్పుకుంటుంది. ఇంతకీ కొత్త టెక్నాలజీ ఎలా పని చేస్తుందంటే..
మొబైల్‌లోనే బిల్డ్ నౌ వెబ్‌సైటును ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు పరిశీలించి.. గరిష్ఠంగా 15 రోజుల్లోపు అనుమతి ఇస్తారని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఇది ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్‌తో పని చేస్తుంది. ఇంటి స్థల విస్తీర్ణం 75 గజాల్లోపు ఉంటే. దరఖాస్తును సమర్పించగానే అనుమతి వచ్చేస్తుంది. ఈ కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మొదట జీహెచ్ఎంసీ పరిధిలో మార్చి 10 నుంచి కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తారు.
This website uses cookies.