Categories: LATEST UPDATES

విల్లాల్లోకి మారిపోదామా!

కరోనా కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో.. అధిక శాతం మంది ఇళ్లల్లో నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. ఇక అపార్టుమెంట్లలో అయితే.. కొందరు ప్రధాన ద్వారం తలుపు తెరిచేందుకూ జంకుతున్నారు. పైగా, అక్టోబరు నుంచి థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు పదేపదే చెబుతున్నారు. అప్పుడేమో చిన్నారులపై అధిక ప్రభావం చూపుతుందని విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో కొందరు గృహ యజమానులు శివార్లలోకి మారేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నారు. ప్రధానంగా, పూర్తి భద్రత ఉండి.. ఆవరణలోనే చిన్నపాటి క్లీనిక్, ఆంబులెన్స్ సౌకర్యం, సూపర్ మార్కెట్ వంటి సౌకర్యాలుండే విల్లా గేటెడ్ కమ్యూనిటీల్లోకి మారేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

భారతదేశంలో జూన్ లోగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పడుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. కాకపోతే, ప్రస్తుత పరిస్థితుల్ని క్షుణ్నంగా గమనిస్తే.. ఒకట్రెండు నెలలు ఎక్కువైనా ఆశ్చర్యపడక్కర్లేదు. కనీసం ఆగస్టు వరకూ పరిస్థితులు చక్కబడినా.. మళ్లీ అక్టోబరులోనే థర్డ్ వేవ్ అంటున్నారు కాబట్టి, ఈసారి కూడా చిన్నారులు ఆన్ లైన్ కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఐటీ ఉద్యోగులు కనీసం మరో ఏడాది దాకా ఆన్ లైన్ లోనే పని చేయాల్సి ఉంటుందని అంచనా. ఇలాంటి అంశాలన్నీ అంచనా వేసిన కొంతమంది.. నగర శివార్లలో సకల సౌకర్యాలున్న విల్లాల్లోకి మారేందుకు ఆలోచిస్తున్నారు. మెరుగైన విల్లా కమ్యూనిటీల సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు.

ఎక్కడున్నాయి?

తెల్లాపూర్, కొల్లూరు, శంకర్ పల్లి, మల్లంపేట్, పటాన్ చెరు, శామీర్ పేట్, మేడ్చల్, మహేశ్వరం వంటి ప్రాంతాల్లో లగ్జరీ విల్లాలు లభిస్తున్నాయి. తొలుత అందులోకి అద్దెకు దిగి.. అన్నివిధాల నచ్చిన తర్వాతే అందులో కొనుక్కోవాలని ఆలోచిస్తున్నారు. విల్లా గేటెడ్ కమ్యూనిటీల్లో ఇళ్లు పక్క పక్కనే ఉన్నప్పటికీ, అపార్టుమెంట్ల తరహా లిఫ్టులు వంటివి కలిసికట్టుగా వాడుకునే అవకాశం ఉండదు. కాబట్టి, పక్కింట్లో కరోనా వచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండదు. కాస్త ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవారిలో కొందరు ఇలా అపార్టుమెంట్ల నుంచి విల్లాల్లోకి మారేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో ఈ పోకడ నగరంలో అధికంగా కనిపించే అవకాశం ఉన్నదని రియల్ ఎస్టేట్ గురు అంచనా వేస్తోంది.

This website uses cookies.