వేదాంత రీసోర్సెస్ వ్యవస్థపకుడు, చైర్మన్ అనిల్ అగర్వాల్ కుటుంబం ముంబై వర్లీలో అదిరిపోయే అపార్ట్ మెంట్ సొంతం చేసుకుంది. రూ.45 కోట్లు వెచ్చించి రహేజా లెజండ్ ప్రీమియం రెసిడెన్షియల్ టవర్ లో ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఈ సీ వ్యూ అపార్ట్ మెంట్ 36వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ ను అగర్వాల్ భార్య, హిందుస్థాన్ జింక్ చైర్మన్, వేదాంత ఫౌండేషన్ ట్రస్టీ అయిన కిరణ్ కొనుగోలు చేశారు. 3,084 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ ను నారంగ్ గ్రూప్ ఫౌండర్, చైర్మన్ రాహుల్ నారంగ్.. అగర్వాల్ కుటుంబానికి విక్రయించారు. అంటే చదరపు అడుగుకు రూ.1.46 లక్షల ధర పలికింది. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన లావాదేవీల్లో ఒకటిగా చెబుతున్నారు.
స్టాంపు డ్యూటీ కింద కిరణ్ రూ.2.25 కోట్లు చెల్లించారు. ఈనెల ఒకటిన రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్టు సమాచారం. అగర్వాల్ కుటుంబం ప్రస్తుతం సముద్ర మహల్ లో ఉంటోంది. దేశంలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీలు కలిగిన ఈ ప్రాంతంలో వారికి సొంతంగా ఓ బంగ్లా ఉంది. ఈ నేపథ్యంలో రహేజా లెజండ్ లోకి వారు వెంటనే వచ్చే ఉద్దేశం లేదని.. కేవలం పెట్టుబడి కోణంలోనే ఆ ఫ్లాట్ కొనుగోలు చేసి ఉంటారని పలువురు అభిప్రాయపడ్డారు. కాగా, ఐనాక్స్ గ్రూప్ ప్రమోటర్ సిద్ధార్థ్ చైన్ ఇటీవల ఇదే అపార్ట్ మెంట్ లో రూ.144 కోట్లు వెచ్చించి క్వాడ్రప్లెక్స్ ఫ్లాట్ కొనుగోలు చేశారు. దేశంలో ఓ సింగిల్ అపార్ట్ మెంట్ కు ఇంత పెద్ద మొత్తంలో ధర పలకడం రికార్డు కావడంతో రహేజా లెజండ్ వార్తల్లోకి వచ్చింది.
This website uses cookies.