Categories: AREA PROFILE

వరంగల్ ప్రాపర్టీ షోకు వెళుతున్నారా?

  • ఎయిర్ పోర్ట్ అంటే ఎగిరి గంతేయకండి!
  • స్మార్ట్ సిటీ అంటే లైట్ తీసుకోండి
  • 2017లో ప్లాటు రేటెంత ఉంది? ఇప్పుడెంత?
  • ఐదేళ్లలో ఏమైనా అద్భుతం జరిగిందా?
  • ఎన్ని ఐటీ కంపెనీలొచ్చాయి?
  • ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయా?
  • అసత్యపు ప్రచారం నమ్మి కొనకూడదు

ప్రాపర్టీ షో అంటే చాలు.. అధిక శాతం మంది డెవలపర్లు.. ఎస్ఎఫ్టీ రేటు ఎక్కువ చేసి చెబుతుంటారు. ఎందుకంటే, ఆయా షోకు పెట్టిన ఖర్చును రాబట్టుకునేందుకు ఎవరో ఒకరు బుట్టలో పడకపోతారా? అని వీరంతా ఎదురు చూస్తుంటారు. అయితే, అందరూ ఇలా వ్యవహరించరనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. కాబట్టి, నిబద్ధతతో ప్రాజెక్టులను నిర్మించేవారి వద్ద మాత్రమే మీరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి. కొందరు రియల్టర్లు ఏం చేస్తారంటే.. ఫలానా ప్రాంతంలో ఏదో అద్భుతం జరుగుతుందన్నట్లు ప్రాపర్టీ షోలలో ప్రచారం చేస్తుంటారు. ఇలాంటివి మీరు ఎట్టి పరిస్థితిలో నమ్మకూడదు. వరంగల్ నగరమే ఇందుకు చక్కటి ఉదాహరణ అని చెప్పొచ్చు. రేటు తక్కువకు వస్తుందని ఎక్కడో దూరంగా ఉన్న ప్రాంతంలో ఫ్లాటు కొనుగోలు చేయకండి. వరంగల్లోని మామునూరులో విమానాశ్రయం వస్తుందంటూ ప్రచారాన్ని అడ్డం పెట్టుకుని వరంగల్లో అనేక మంది బిల్డర్లు ప్లాట్లు, ఫ్లాట్ల ధరల్ని విపరీతంగా పెంచేసి మధ్యతరగతికి అంటగట్టారు. మరి కొందరు బిల్డర్లు.. వరంగల్లో ఐటీ పార్కు పక్కనే అని.. టెక్స్ టైల్ పార్కుకి సమీపంలో అని.. భూముల రేట్లను పెంచేసి అమాయకులకు అంటగట్టేశారు. కాబట్టి, ఇలాంటి మాయగాళ్ల జాబితాలో మీరు ఎట్టి పరిస్థితిలో పడకండి.

  • స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ, ఇంకేందో సిటీ అంటూ.. డీపీఆర్లు సిద్ధమయ్యాయంటూ కొందరు డెవలపర్లు చెబుతుంటారు. జీవోలు ఇవ్వడం, డీపీఆర్లు సిద్ధం చేయడం వంటివి సర్వసాధారణమైనవే. కాబట్టి, వీటిని చూపెట్టి ప్లాట్లు, ఫ్లాట్లు అమ్మే బిల్డర్లను నిలదీయండి. 2017లో ఉన్న రేటేంటి.. ప్రస్తుతమున్న ధర ఎంత ఉంది? అనే అంశాన్ని పరిశీలించండి. అప్పటితో పోలిస్తే ఇప్పుడేమైనా డెవలప్మెంట్ జరిగిందా? అనే అంశాన్ని నిశితంగా గమనించాకే.. సొంతింటి ఎంపికకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాలి.
  • మీరే స్టాల్ కు వెళ్లినా.. తమ ప్రాజెక్టు అద్భుతమని ప్రతిఒక్క ఎగ్జిక్యూటివ్ చెబుతారు. దీంతో, మీకు ఏం చేయాలో కొన్ని సార్లు అర్థం కాదు. ఎవరు కరెక్టుగా చెబుతున్నారో.. తప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నారో తెలియదు. కాబట్టి, మీరు ఏ ప్రాపర్టీ షోకు వెళ్లినా.. ముందుగా కొంత ప్రాథమిక సమాచారం గురించి తెలుసుకోండి.
  • ఆయా బిల్డర్ నాణ్యతగా కడతారా? లేదా? తెలుసుకోండి. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయా ప్రాజెక్టు పేరుతో గూగుల్ రివ్యూస్ అని టైప్ చేస్తే.. మీకు పూర్తి సమాచారం లభిస్తుంది. ఇప్పటికే ఆయా బిల్డర్ లేదా ప్రాజెక్టులో ఫ్లాట్లు కొన్నవారి అనుభవాలు తెలుస్తాయి.
  • ప్రతి ప్రాజెక్టు మాదాపూర్ కి దగ్గరనో.. గచ్చిబౌలికి చేరువలో ఉందనో చెబుతుంటారు. అప్పుడు మీరేం చేస్తారంటే.. ఒకసారి గూగుల్ మ్యాప్స్ కి వెళితే ఆయా ప్రాజెక్టు ఎక్కడుందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి, అది మీరు ఆశించినంత దగ్గర్లో ఉందా? లేదా? అనే విషయం తెలుస్తుంది.
  • కొన్ని భూములకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి. అయినా, కొందరేం చేస్తారంటే, స్థానిక సంస్థలను ఏదోరకంగా మేనేజ్ చేసి నిర్మాణానికి అనుమతిని తెచ్చుకుంటారు. తీరా మీరు ఫ్లాట్ కొన్న కొన్నాళ్ల తర్వాత కానీ.. అందులో ఏదో ఒక లీగల్ సమస్య ఉందని తెలియదు. ఇలాగే హైదరాబాద్లో చాలామంది ఫ్లాట్లను పలువురు బిల్డర్ల వద్ద కొనుగోలు చేసి అడ్డంగా బుక్కయ్యారు. కాబట్టి, లీగల్ క్లియరెన్స్ గురించి అడిగి తెలుసుకోవాలి. వీలైతే, మీరు కొంత ఖర్చు చేసి అయినా న్యాయవాదిని సంప్రదించి.. ఆయా భూమికి సంబంధించి ఏమైనా చట్టపరమైన లొసుగులున్నయా? లేవా? అని తెలుసుకోండి. ఆయా భూమి న్యాయపరంగా ఎవరి పేరు మీద ఉందో కనుక్కోండి. స్థలయజమాని, డెవలపర్ మధ్య కుదిరిన ఒప్పంద పత్రం గురించి అడిగి తెలుసుకోండి.
  • మీరు ప్రాపర్టీ షోకు వెళ్లే ముందు మీ ఆర్థిక స్థోమత.. మీరు ప్లాటు కోసమే లేదా ఫ్లాటు కోసం ఎంత ధర పెట్టగలరనే అంశం మీద స్పష్టతకు రావాలి. ఇప్పటివరకూ మీరు ఎంత పొదుపు చేశారు? రుణం తీసుకుంటే నెలసరి వాయిదా ఎంత మొత్తం చెల్లించాలనే అంశంలో స్పష్టతకు రావాలి. నెలసరి వాయిదా మొత్తం గురించి తెలుసుకునేందుకు అక్కడే ఉన్న బ్యాంకర్లను అడిగి తెలుసుకోండి. అప్పుడే, మీరు సొంతింటి నిర్ణయాన్ని సులువుగా తీసుకోగల్గుతారు.

This website uses cookies.