Categories: LATEST UPDATES

ఇళ్ల సమస్యకు మార్గమేంటి?

దేశంలో ఇళ్లకు సంబంధించిన అంశం గందరగోళంగా ఉంది. ఓవైపు పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడంలో గృహాల కొరత అడ్డంకిగా మారింది. మరోవైపు దేశంలో ఖాళీగా ఉన్న ఇళ్లు చాలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2012లో 18.78 మిలియన్ గృహాల కొరత ఉండగా.. అది 2018కి 54 శాతం మేర పెరిగి 29 మిలియన్లకు చేరింది. మరోవైపు 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య 2001లో 6.3 శాతం ఉండగా.. 2011 నాటికి 7.5 శాతానికి పెరిగింది. దీనికి కారణాలేంటి?

భారతదేశం ఇటీవల దశాబ్దాలలో వేగంగా పట్టణీకరణ చెందింది. 1951లో పట్టణ జనాభా 62.4 మిలియన్లు ఉండగా.. 2011 నాటికి అది 377.1 మిలియన్లకు చేరింది. దీంతో నగరాలు వలస జనాభా మొత్తానికి ఇళ్లు అందించడంలో విఫలమవుతున్నాయి. ఇదంతా కూడా లోపభూయిష్టమైన విధానాల వల్లే జరుగుతోంది. అందుబాటు గృహాలకు అధిక డిమాండ్ ఉండగా.. విలాసవంతమైన గృహాల అందుబాటు ఎక్కువగా ఉంటోంది. కొనసాగుతున్న పట్టణీకరణ, పట్టణ వలసలు సరసమైన గృహాల కోసం డిమాండ్ ను తీవ్రతరం చేశాయి.

అదే సమయంలో దేశంలోని ఇళ్ల విధానం.. అందరికీ గృహాలు అందించడం అంటే ఇంటిపై యాజమాన్య హక్కు కల్పించడం అనే అంశం మీదనే సాగుతోంది. దీనికి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం లేదు. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు కొనడం అనేది అంత ఈజీ కాదు. అందువల్ల చాలామంది సొంత ఇంటి కల నెరవేర్చుకోలేక అద్దెకు తీసుకుంటారు. దీనివల్ల అద్దె ఇళ్లకే డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో పెరుగుతున్న ఇళ్ల కొరతను సమర్థవంతంగా అధిగమించడానికి ఒక చక్కని అద్దె గృహాల విధానం తప్పనిసరి అని స్పష్టమవుతోంది.

సరసమైన అద్దె గృహాలు అనేది హౌసింగ్ విభాగంలో చాలా చిన్న అంశం. అయినప్పటికీ చాలామందికి ఇదే ప్రాధాన్య ఎంపికగా ఉంది. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా అద్దె గృహాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ విధానాలన్నీ సొంతింటి వైపు ఉండటం వల్ల అద్దె గృహాలను పట్టించుకోవడంలేదు. అదే సమయంలో అద్దె ఇళ్ల లభ్యతను పెంచే విషయంలో ప్రభుత్వ విధానపరమైన జోక్యం లేకపోవడం కూడా ప్రతికూలతగా పరిణమించింది.

ఈ నేపథ్యంలో జాతీయ పట్టణ అద్దె ఇళ్ల ముసాయిదా విధానం, మోడల్ అద్దెదారు చట్టం ఈ పరిస్థితిని చక్కదిద్దే లక్ష్యంతో ఉన్నాయి. అయితే, ఈ విధానాలు విజయవంతం కావాలంటే అన్ని రాష్ట్రాలనూ ఇందులో భాగస్వాములుగా ఉండేలా ప్రోత్సహించాలి. మొత్తమ్మీద భారతదేశం ‘అందరికీ ఇళ్లు’ అనే లక్ష్యాన్ని సాధించడానికి, పట్టణ పేదల గృహ అవసరాలు తీర్చడానికి అద్దె గృహాలను సరసమై ప్రత్యామ్నాయంగా ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంది.

This website uses cookies.