స్థిరాస్తి రంగంలో కొనుగోలుదారుల ప్రయోజనాలు పరిరక్షించే విషయంలో మహారాష్ట్ర రెరా ఎప్పుడూ ముందుంటుంది. వారి ప్రయోజనాలే పరమావధిగా నిరంతరం పని చేస్తూ.. ఇప్పటికే బోలెడు ఆర్డర్లు జారీ చేసింది. స్థిరాస్తి కొనుగోళ్లలో పారదర్శకత, బిల్డర్లలో జవాబుదారీతనం పెంపొందించే విధంగా అహర్నిశలూ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల రెరాలు కూడా వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలను అనుసరించాల్సిన అవసరం ఉంది. అవేంటో చూద్దామా?
స్థిరాస్తి కొనుగోళ్ల క్రమబద్ధీకరణతోపాటు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి కొనుగోలుదారులకు అప్పగించడమే రెరా చట్టం, 2016 ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి మహారాష్ట్ర రెరా ఇప్పటికే పలు ఉత్తర్వులు జారీ చేసింది. డెలివరీ తేదీలు, బ్యాంకు ఖాతాల నిర్వహణ, పార్కింగ్ స్పేస్, ఫిర్యాదుల పరిష్కారం తదితరాలకు సంబంధించి బిల్డర్లకు చాలా ఆదేశాలిచ్చింది. నిలిచిపోయిన లేదా జాప్యం జరిగిన 1750 ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ ను నిలిపివేసింది. సీనియర్ సిటిజన్ హౌసింగ్ ప్రాజెక్టుల విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. దాదాపు 20వేల మంది ఏజెంట్ల రిజిస్ట్రేషన్ ను ఏడాది పాటు సస్పెండ్ చేసింది. అంతేకాకుండా నిర్మాణ నాణ్యతను తనిఖీ చేయడం కోసం థర్డ్ పార్టీ పర్యవేక్షణకు సంబంధించి మార్గదర్శకాలు ఇచ్చింది.
ఏ వ్యక్తికైనా వారి జీవితంలో అతిపెద్ద పెట్టుబడి ఇంటి పైనే ఉంటుంది. అయితే, ప్రాజెక్టుల్లో జాప్యాలు, డెవలపర్లు ఇచ్చిన హామీలు తప్పడం వంటి అంశాల కారణంగా వారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పలు సమస్యలకు చెక్ చెప్పే విధంగా మహా రెరా చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఇంటని అప్పగించిన తర్వాత ఏడాది పూర్తయినా కూడా ఎమినిటీస్ విషయంలో బిల్డర్లు చెప్పింది పాటించడంలేదని గుర్తించింది. ఈ నేపథ్యంలో ఎమినిటీస్ కు సంబంధించి అన్ని వివరాలతో పాటు ఎప్పుడు వాటిని పూర్తి చేస్తారో కచ్చితంగా సేల్ ఆఫ్ అగ్రిమెంట్ లో పేర్కొనాలని స్పష్టం చేసింది. అలాగే ప్రాజెక్టుకు సంబంధించి లీగల్, టెక్నికల్, ఫైనాన్షియల్ వివరాలతో గ్రేడింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా కొనుగోలుదారులు అన్ని వివరాలూ పరిశీలించుకుని ఆ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టాలా వద్దా అనేది నిర్ణయం తీసుకునే అవకాశం కలిగింది.
మహా రెరా చర్యలకు క్రెడాయ్ ఇండియా మద్దతు తెలిపింది. ఇవన్నీ కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంపొందిస్తాయని పేర్కొంది. మహా రెరా ఉత్తర్వులన్నీ ప్రాజెక్టుల సమగ్రతను పటిష్టం చేయడమే కాకుండా పెట్టుబడులను మరింత ఆకర్షిస్తాయని తెలిపింది. అంతేకాకుండా డెవలపర్లు కొనుగోలుదారులు మెచ్చేలా అధిక నాణ్యతా ప్రమాణాలు పాటిస్తారని వ్యాఖ్యానించింది.
2017 మేలో మహారాష్ట్రలో రెరా చట్టం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 46వేల ప్రాజెక్టులు రిజిస్టర్ అయ్యాయి. దేశంలోని ఏ రెరా కంటే కూడా ఇవి ఎక్కువ. కొనుగోలుదారుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. వీటి పరిష్కారంలో ఉత్తరప్రదేశ్ రెరా.. మహా రెరా కంటే ముందుంది. కొత్త చట్టాలు, నిబంధనలను తీసుకురావడంలో మహా రెరాదే పై చేయి. ప్రాజెక్టుల మార్కెటింగ్, వాణిజ్య ప్రకటనలపై తప్పనిసరిగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలతో క్యూఆర్ కోడ్ ముద్రించాలని గతేడాది ఆదేశించింది. దానిని యూపీ రెరా ఈ ఏడాది నుంచి పాటిస్తోంది.
నిజానికి స్థిరాస్తి రంగంలో రెరా చాలా మార్పులే తీసుకొచ్చింది. ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడంతోపాటు, డెలివరీ టైమ్ లైన్, లావాదేవీలలో పారదర్శకత వంటివి ఇందులో ఉన్నాయి. అయితే, చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఎందుకంటే, ఇటీవల కాలంలో వడ్డీ జరిమానా లేదా రిఫండ్, పరిహారం వంటి వాటి విషయంలో కొనుగోలుదారులకు అనుకూలంగా చాలా ఆదేశాలిచ్చింది. కానీ బిల్డర్లు వాటిని అంతగా పాటించడం లేదు. దీంతో కొనుగోలుదారులు ట్రిబ్యునళ్లు, వినియోగదారులకు ఆశ్రయించాల్సి వస్తోంది.