Categories: LATEST UPDATES

2024 ఇళ్ల అమ్మకాల్లో రెండంకెల వృద్ధి..

  • ప్రాపర్టీ ధరలు 5 నుంచి 6 శాతం మేర పెరిగే అవకాశం
  • క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడి

దేశంలో రియల్ రంగానికి ఈ ఏడాది కూడా బాగుంటుందని, ఇళ్ల అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి సాధించడం ఖాయంగా కనపడుతోందని పేర్కొంది. అలాగే సగటు ప్రాపర్టీ ధరలు 5 నుంచి 6 శాతం మేర పెరిగే అవకాశం ఉందని, టైర్-2 మార్కెట్లో ఇంటి యాజమాన్యానికి డిమాండ్ పెరుగుతుందని తెలిపింది.

ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రియల్ ఎస్టేట్ నివేదికను విడుదల చేసింది. కొనుగోలుదారుల నుంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది స్థిరాస్తి అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 12 నుంచి 14 శాతం మేర పెరిగి 785 నుంచి 800 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని తెలిపింది.

ఇక్రా అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటు ఆస్తి ధరలు 5-6% పెరుగుతాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 11 శాతంగా ఉంది. ఇక టైర్-2 నగరాల్లో కూడా రియల్ ఎస్టేట్ కు డిమాండ్ పెరిగిందని.. మెట్రో నగరాల్లో కనిపించే పోకడలు, ముఖ్యంగా ప్రీమియమైజేషన్ వైపు మొగ్గు చూపుతున్నారని నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో పలువురు బ్రాండెడ్ డెవలపర్లు టైర్-2 నగరాల్లో అవకాశాల ఎలా ఉన్నాయో పరిశీలిస్తున్నారని వెల్లడించింది.

మరోవైపు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో లాంచ్ లు 12 శాతం మేర పెరిగి 767 మిలియన్ చదరపు అడుగులకు చేరతాయని అంచనా. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో స్థిరాస్తి లావాదేవీల నుంచి నగదు ప్రవాహం 9 నుంచి 11 శాతం మేర మెరుగుపడుతుందని.. అలాగే రుణాలు కూడా 6 నుంచి 7 శాతం మేర పెరుగుతాయని ఇక్రా అంచనా వేసింది. ఈ రుణం కొత్త వ్యాపార అభివృద్ధికి, భూసేకరణకు నిధులు సమకూరుస్తుందని తెలిపింది. అలాగే యూనిట్ అమ్మకాల పెరుగుదల, సగటు అమ్మకపు ధరల పెరుగుదల కారణంగా మార్చి 31, 2025తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో కలెక్షన్లు సంవత్సరానికి 19 నుంచి 21 శాతం మేర పెరుగుతుందని ఇక్రా పేర్కొంది.

This website uses cookies.