కొందరు స్థల యజమానుల్లో అత్యాశ పీక్‌కు చేరుకుంది. ఎవరెక్కువ అంతస్తులు కడితే వాళ్లకే డెవలప్‌మెంట్‌కి ఇచ్చేస్తున్నారు. ఆయా బిల్డర్ కడతాడా? లేదా? అనే అంశాన్ని పట్టించుకోవట్లేదు. తనకు అడ్వాన్స్ ఎంత వస్తుంది? బిల్టప్ ఏరియా ఎంతొస్తుందనే విషయాన్ని మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇక మరికొందరిలో అయితే అత్యాశ తారాస్థాయికి చేరుకుంది. డెవలప్‌మెంట్‌కి బిల్డర్‌కి ఇచ్చేదెందుకు? సివిల్ ఇంజినీర్లను పెట్టుకుని అపార్టుమెంట్లను కట్టడం బ్రహ్మ విద్యా అంటూ నిర్మాణాల్ని చేపడుతున్నారు. ఇలాంటి వారు ప్రీలాంచ్‌లో తక్కువ రేటుకు ఫ్లాట్లను విక్రయించి.. నిర్మాణాలను కట్టడంలో మాత్రం తప్పులు మీద తప్పులు చేస్తున్నారు.
బిల్డర్లుగా అవతరించిన స్థల యజమానులు.. అనుభవజ్ఞులైన సివిల్ ఇంజినీర్లు చెప్పే మాటలు నమ్మక.. తాము సరిగ్గా చేయక.. ఏయే పనిని ఎప్పుడు చేయాలో తెలియక.. నిర్మాణాల్ని కట్టిన వాస్తవిక అనుభవం లేక.. కొనుగోలుదారులకు చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి అత్యాశ గల స్థల యజమానుల వల్ల నిర్మాణ రంగానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి, కొనుగోలుదారులు ఇలాంటి వారి వద్ద ఫ్లాట్లు కొనేటప్పుడు.. ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రేటు తక్కువని రాజీపడి కొనుగోలు చేస్తే.. నాసిరకమైన నిర్మాణంలో నివసిస్తూ జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది.
కాబట్టి, అపార్టుమెంట్లలో ఫ్లాట్లు కొనేవారు తప్పకుండా బిల్డర్ గత చరిత్ర తప్పకుండా తెలుసుకోవాలి. గతంలో ఎన్ని అపార్టుమెంట్లను నిర్మించాడు? సకాలంలో అందించాడా? లేదా? అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ఆతర్వాతే ఫ్లాటు కొనాలా? వద్దా? అనే అంశంలో తుది నిర్ణయానికి రావాలి. లేకపోతే, ఇలాంటి వారి వల్ల బయ్యర్లు, వెండార్లు, వృత్తి నిపుణులు.. ఇలా ప్రతిఒక్కరూ ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
This website uses cookies.