2026 నాటికి అదనంగా 791 మెగావాట్ల
సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు
ఇందుకు 10 మిలియన్ చదరపు అడుగుల స్పేస్ అవసరం
దేశంలో డేటా సెంటర్ల డిమాండ్ కొనసాగుతోంది. 2026 నాటికి 791 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అదనంగా వస్తాయని.. ఫలితంగా రియల్ ఎస్టేట్ లో వాణిజ్య విభాగంలో 10 మిలియన్ చదరపు అడుగులు స్పేస్ అవసరం అవుతుందని జేఎల్ఎల్ అంచనా వేసింది. తద్వారా రియల్ ఎస్టేట్ స్థలం కోసం డిమాండ్ పెరగడమే కాకుండా 5.7 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను ఆకర్షిస్తుందని పేర్కొంది.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు డిమాండ్ పెరుగుతోంది. దీంతో డేటా సెంటర్లకు కూడా డిమాండ్ పెరిగింది. 2024-26 మధ్య కాలంలో దేశంలో 650-800 మెగావాట్ల సామర్థ్యం మేర డేటా సెంటర్ల అవసరం ఏర్పడుతుందని జేఎల్ఎల్ తన నివేదికలో వివరించింది. ఏఐ ఆధారిత డిమాండ్ పెరగడంతో ప్రాథమికంగా డేటా నిల్వ, ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేయగల కంప్యూటింగ్ పవర్ కోసం క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు (సీఎస్సీలు) డేటా సెంటర్ల వినియోగాన్ని పెంచారు. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత వృద్ధిని పెంచేందుకు సీఎస్పీలు అధిక పెట్టుబడులను కూడా ప్రకటించాయి.
2022 ద్వితీయార్థంలో 72 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ల వినియోగం జరగ్గా.. 2023 ద్వితీయార్థంలో అది 81 మెగావాట్లకు చేరింది. అంటే 12 శాతం పెరుగుదల నమోదైంది. 2023 ప్రథమార్థంలో స్వల్ప విరామం తర్వాత సీఎస్పీలు ఊపందుకోవడమే ఇందుకు కారణం. పెరుగుతున్న డిజిటల్ వినియోగ ధోరణులకు అనుగుణంగానే దేశంలోని డేటా సెంటర్ల రంగం 2019లో 350 మెగావాట్ల నుంచి 2023లో 854 మెగావాట్లకు విస్తరించింది.
This website uses cookies.